
‘పనిముట్టు’కుంటే ఒట్టు..
● వ్యవసాయ యాంత్రికీకరణకు ఏళ్లుగా వీడని గ్రహణం ● నిధుల కేటాయింపుతోనే సరిపెట్టిన ప్రభుత్వం ● సమగ్ర మార్గదర్శకాలు రాక అధికారులు, రైతుల ఎదురుచూపులు ● 2016 తర్వాత అన్నదాతలకు అందని యంత్ర పరికరాలు
ఖమ్మంవ్యవసాయం: అన్నదాతలకు చేయూతనిచ్చేలా రూపొందించిన యాంత్రికీకరణ(పనిముట్ల) పథకానికి గ్రహణం పట్టింది. ఏళ్ల తరబడి నిధుల కేటాయింపుతోనే సరిపెడుతూ.. పరికరాలు మాత్రం కేటాయించకపోవడంతో రైతులు ఎక్కువ ఖర్చుతో కొనలేక ఆధునికతకు చేరువ కాలేకపోతున్నారు. సాగులో ఆధునిక పరికరాల వాడకంపై ఆసక్తి ఉన్నా ప్రభుత్వం నుంచి సబ్సిడీపై మంజూరు కాకపోవడం వారిని నిరాశకు గురిచేస్తోంది.
కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా..
అధునాతన వ్యవసాయ విధానాలకు అవసరమైన యంత్ర పరికరాలను రైతులకు అందించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేలా యాంత్రికీకరణ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. ట్రాక్టర్లు, రోటోవేటర్లు, పవర్ టిల్లర్లు, డ్రోన్లు, డ్రోన్లు, సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రమ్ములు, డిస్క్‌లు, నాగండ్లు, పవర్ వీడర్లు, బ్రష్ కట్టర్లు, మొక్కజొన్న, వరి నూర్పిడి యంత్రాలే కాక గడ్డి కట్టలు కట్టేవి, పంట కోసే యంత్రాలను 50 – 90 శాతం వరకు రాయితీపై అందించాల్సి ఉంటుంది. ఇందులో 60 శాతం నిధులను కేంద్రం, 40శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. జనరల్, బీసీ కేటగిరీల వారికి 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం వరకు రాయితీ అందుతుంది. అయితే, 2016–17 వరకు పడుతూ లేస్తూ అమలైన పథకం ఆరేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. గత ప్రభుత్వం రైతుబంధు పథకం పేరిట ఎకరాకు రూ.5 వేల చొప్పున సాగుసాయం అందించినా యాంత్రికీరణకు పూర్తిగా పక్కన పెట్టేసింది.
అమలులో మీనమేషాలు
యాంత్రికీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించిన ప్రస్తుత ప్రభుత్వం అమలులో మీన మేషాలు లెక్కిస్తోంది. 2024–25 సంవత్సరానికి నిధుల కేటాయించి, దరఖాస్తుల స్వీకరించాలని వ్యవసాయ శాఖను ఆదేశించినా సమగ్ర మార్గదర్శకాలను మాత్రం విడుదల చేయలేదు. యాంత్రికీకరణ పథకాన్ని 50 శాతం మహిళా రైతులకు వర్తింపచేస్తామని చెబుతూ జిల్లాకు రూ. 1.12 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో అర్హులైన 428 మందికి యంత్ర పరికరాలను అందించొచ్చని భావించారు. ఆతర్వాత దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపికపై ముందడుగు పడకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
సమగ్ర మార్గదర్శకాలు లేక...
ప్రభుత్వం ఆర్దిక సంవత్సం ముగుస్తున్న వేళ హడావిడిగా మార్చిలో ఈ పథకానికి నిధులు కేటాయించారు. నిర్దేశించిన యంత్ర పరికరాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే, ఆ ఆదేశాల్లోని యంత్ర పరికరాలు పరిశీలిస్తే ప్రతీ జిల్లాలో వందల సంఖ్యలో రైతులకే ప్రయోజనం చేకూరుతుందని భావించగా.. మార్పులకు సూచనలు చేసింది. దీంతో పథకం అమలు అయోమయంలో పడింది. ఇంతలోనే గత ఏడాది కేటాయించిన నిధులకు తోడు 2025–26 ఆర్థిక సంవత్సరం నిధులు కూడా కలిపి ఎక్కువ మంది రైతులకు పథకాన్ని వర్తింపజేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వానాకాలం సీజన్ సమీపిస్తున్నా ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏళ్ల తరబడి నిర్లక్ష్యం
2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయ యాంత్రికీకరణ పథకం అమలు జరగడం లేదు. ఆరేళ్లకు పైగా పరికరాలను అందించకపోవటంతో రైతులు బ్యాంకులను ఆశ్రయించి రుణాలపై కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పథకాన్ని తెరపైకి తీసుకొచ్చినా ఆచరణలో జాప్యం చేస్తుండడంతో రైతులకు పాత పరిస్థితే ఎదురుకానుంది.
ఆదేశాలు రాగానే అమలు
యాంత్రికీకరణ పథకంపై ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తాం. 2024–25 ఆర్థిక సంవత్సరానికి నిధుల కేటాయింపు జరిగింది. అయితే ఎక్కువ మందికి లబ్ధి జరగాలనే ఆలోచన చేయడంతో ప్రక్రియ నిలిచింది. ప్రభుత్వం నుంచి సమగ్ర మార్గదర్శకాలు అందితే అమలు ప్రారంభిస్తాం.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి

‘పనిముట్టు’కుంటే ఒట్టు..