
సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం
ఖమ్మంమయూరిసెంటర్: అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులతోపాటు ఇతర సంక్షేమ పథకాలు అమలయ్యే వరకూ పోరాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు తెలిపారు. సీపీఎం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కేఎంసీ కార్యాలయం ఎదుట శనివారం ప్రజలతో కలిసి ధర్నా చేశారు. పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో పదేళ్లు సాగదీస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాల విషయంలో అదే ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్న ప్రస్తుత పాలకులు.. మూసీ సుందరీకరణ, అందాల పోటీలకు ఉన్న నిధులు ఆరు గ్యారంటీల అమలుకు ఎందుకు వెచ్చించడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా కాంగ్రెస్ శ్రేణులకు కాకుండా అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వడంతో పాటు పింఛన్ల కోసం అందిన దరఖాస్తులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, మున్నేరు రిటైనింగ్ వాల్, తీగల వంతెన నిర్మాణాలతో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావు డిమాండ్ చేశారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీఉల్లాకు వినతిపత్రం అందజేశారు. పార్టీ నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, మాదినేని రమేశ్, పొన్నం వెంకటేశ్వర్లు, తుమ్మా విష్ణువర్ధన్‌రెడ్డి, బండారు రమేశ్, ఎంఏ జబ్బార్, ఎస్.నవీన్‌రెడ్డి, తిరుపతిరావు, మీరా సాహెబ్, కార్పొరేటర్ యర్రా గోపి తదితరులు పాల్గొన్నారు.
కేఎంసీ ఎదుట ధర్నాలో
సీపీఎం నాయకులు పోతినేని, నాగేశ్వరరావు

సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం