
మాస్టర్ ప్లాన్‌లో కదలిక..
● తుది ముసాయిదాపై కసరత్తు ● ఈనెలాఖరుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరించేలా వేగం ● పాత సుడా పరిధిలోనే ప్లాన్ రూపకల్పన
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌ను కలుపుకుని రూపొందించే ‘సుడా’ మాస్టర్ ప్లాన్‌లో కదలిక వస్తోంది. ఐదేళ్లుగా యంత్రాంగం తర్జనభర్జన పడుతుండగా, రకరకాల కారణాలతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా పబ్లికేషన్ వాయిదా పడుతోంది. దీంతో అటు సుడా పరిధి, ఇటు కేఎంసీలో అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యాన మాస్టర్ ప్లాన్‌ను త్వరగా సిద్ధం చేసి ఆమోదంలోకి తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించగా సుడా, కేఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
పాత ‘సుడా’ పరిధిలో..
రాష్ట్ర ప్రభుత్వం సుడా పరిధిని విస్తరిస్తూ గతేడాది నవంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మాస్టర్ ప్లాన్ కూడా మళ్లీ మొదటి నుంచి తయారు చేస్తారని అంతా భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం పాత స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా) పరిధిలోనే మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని సూచించింది. ఈమేరకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేన్‌తో పాటు ఏడు మండలాలకు చెందిన 46 గ్రామపంచాయతీల పరిధిలో ప్లాన్ రూపకల్పనపై దృష్టి సారించారు. అయితే, మాస్టర్ ప్లాన్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని, నిర్మాణాలకు అడ్డంకిగా ఉన్న ఆంక్షలు తొలగించే అవకాశముందన్న చర్చ జరుగుతోంది.
సమావేశాలు ముగిసినా..
సుడా మాస్టర్ ప్లాన్‌పై రెండేళ్లుగా కసరత్తు చేస్తున్నారు. తొలుత 2021లోనే మాస్టర్ ప్లాన్ అమలుచేయాలని నిర్ణయించినా సాధ్యం కాలేదు. ఆతర్వాత ఓ ప్రైవేట్ సంస్థతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించి 2022 ఫిబ్రవరి 11న తొలి స్టేక్ హోల్డర్ల సమావేశం నిర్వహించారు. అందులో వచ్చిన సూచనల ఆధారంగా మార్పులు చేసి అదే ఏడాది జూలై 1న రెండో సమావేశం నిర్వహించి మళ్లీ సలహాలు స్వీకరించారు. అనంతరం వాటిని కూడా ప్లాన్‌లో పొందుపరిచారు. అయితే, 2022 అక్టోబర్ – నవంబర్‌లో ముసాయిదా ప్లాన్ పబ్లిష్ చేయాల్సి ఉన్నా సవరణల కోసం అధికారులు వాయిదా వేస్తూ వచ్చారు.
బఫర్ జోన్‌లో మార్పులు
గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన వరదలతో మున్నేరు పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో మున్నేరు బఫర్ జోన్ పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తద్వారా మాస్టర్‌ప్లాన్‌లో స్వల్ప సవరణలు చేసేలా ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. అలాగే, స్టేక్ హోల్డర్ల నుండి కొన్ని ప్రాతిపాదనలు రాగా అవి కూడా పొందుపర్చే అవకాశముంది. మున్నేరు, చెరువులు, నాలాలు, కాల్వల బఫర్ జోన్లకు సంబంధించి కొద్ది మార్పులు జరగనుండగా.. ఈనెలాఖరులోగా ముసాయిదాను విడుదల చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నట్లు తెలిసింది.
సుడా పరిధి తెలియచేసే మ్యాప్
ప్లాన్ ఉంటేనే అభివృద్ధి..
రాష్ట్రంలో ప్రధాన నగరంగా ఖమ్మం
విస్తరిస్తుండడమే కాక అన్ని రంగాల్లో
అభివృద్ధి సాధిస్తోంది. ఈ నేపథ్యాన మాస్టర్ ప్లాన్ ఉంటే పద్ధతి ప్రకారం
అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది. అలా లేకపోవంతో నిర్మాణాలు అడ్డగోలుగా
జరుగుతుండగా.. రోడ్లు వెడల్పుగా లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ
నేపథ్యాన మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తేనే నగర అభివృద్ధి ప్రణాళికాయుతంగా
జరుగుతుందని.. తద్వారా భవిష్యత్‌లో సమస్యలు ఉండవని భావిస్తున్నారు.
త్వరలోనే తుదిరూపం
సుడా మాస్టర్ ప్లాన్ తుది ముసాయిదాను ఏజెన్సీ నిర్వాహకులు వారం రోజుల్లో సిద్ధం చేయన్నారు. ఈ ముసాయిదాను పబ్లిష్ చేశాక ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపిస్తాం. కేఎంసీతో పాటు పాత సుడా పరిధిని పరిగణనలోకి తీసుకుని ఈ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం.
– అభిషేక్ అగస్త్య, కేఎంసీ కమిషనర్,
సుడా వైస్ చైర్మన్

మాస్టర్ ప్లాన్‌లో కదలిక..