
గిరిజన సంస్కృతిని పరిరక్షించాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
ములకలపల్లి : గిరిజన సంస్కృతిని పరిరక్షించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అన్నారు. మండల పరిధిలోని రాజీవ్‌నగర్‌లో గురువారం నిర్వహించిన భూమి పండుగ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీలు ఏ కార్యం తలపెట్టినా గ్రామదేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం స్థానిక యువకులతో కలసి బాణం సంధించారు. ఆ తర్వాత పాత గుండాలపాడు గ్రామాన్ని సందర్శించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. 35 ఏళ్ల క్రితం అప్పటి పీఓ జేసీ శర్మ తమ గ్రామాన్ని సందర్శించారని, మళ్లీ ఇప్పడు రాహుల్ రావడం ఆనందంగా ఉందని స్థానికులు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డును పూర్తి చేయాలని, ఐటీడీఏ ద్వారా వ్యవసాయ మోటార్లు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో భద్రాచలం గిరిజన మ్యూజియం ఇన్‌చార్జ్ వీరస్వామి, గ్రామపెద్దలు తుర్రం శ్రీను, మాజీ ఎంపీటీసీ నూపా సరోజిని తదితరులు పాల్గొన్నారు.
బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ పరిశీలన
సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ, గనుల్లో ఉపయోగిస్తున్న కంటిన్యూస్ మైనర్, ఎల్‌హెచ్‌డీ యంత్రాల పనితీరును అటవీ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. కొత్తగూడెంలోని పీవీకే –5 ఇంక్లెయిన్ గనిని గురువారం వారు సందర్శించారు. ఏరియాకు వచ్చిన అధికారుల బృందానికి జీఎం ఎం.శాలేంరాజు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం గని అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, రవాణాకు సంబంధించిన వివరాలు, యంత్రాల పనితీరును తెలియజేశారు. ఆ తర్వాత అధికారులు మ్యాన్‌రైడింగ్ ద్వారా గనిలోకి దిగి పంపింగ్ స్టేషన్, సబ్‌స్టేషన్ ప్రాంతాలను వీక్షించారు. అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (సెంట్రల్) డాక్టర్ వి.ఆర్.జెన్సర్ ఆధ్వర్యంలో డాక్టర్ త్రినాథ్‌కుమార్, సీసీఎఫ్ డి.భీమానాయక్, ఖమ్మం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, కొత్తగూడెం డివిజనల్ అటవీ అధికారి కోటేశ్వరరావు తదితరులు పర్యటించారు.