
నెట్‌జీరో నెరవేరేనా..?
2023లో యాక్షన్ ప్లాన్ ప్రారంభించిన సింగరేణి
● 2024 కల్లా 532 మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యం ● గడువు పూర్తయినా 300 మెగావాట్లు దాటని వైనం ● టెండర్ల దశలోనే మగ్గుతున్న కొత్త పవర్ ప్లాంట్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బహుముఖంగా విస్తరించిడంపై దృష్టి సారించిన సింగరేణి.. బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్, సోలార్ విద్యుత్ రంగంలోకి వచ్చింది. త్వరలో రేర్ ఎర్త్ మినరల్స్ విభాగంలోనూ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే నలుదిశలా విస్తరించే క్రమంలో ముందుగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో సంస్థ వెనకబడటం విమర్శలకు తావిస్తోంది.
2023లోనే టెండర్లకు పిలుపు..
కొత్తగా ఎనిమిది సోలార్ పవర్ ప్లాంట్లను వేర్వేరు ఏరియాల్లో నిర్మించాలని సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం స్థల సేకరణ కూడా పూర్తి చేయడంతో పాటు ప్లాంట్ల నిర్మాణానికి రూ.1,348 కోట్లు కేటాయించింది. ఈ మేరకు 2023 ఆగస్టులో టెండర్లు ఆహ్వానించింది. సెప్టెంబర్‌లో ప్రీ బిడ్ సమావేశం నిర్వహించి, టెండర్లలో పాల్గొనే ఏజెన్సీల సందేహాలను నివృత్తి చేసింది. 2024 సెప్టెంబర్ నాటికి 232 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయి విద్యుదుత్పత్తి ప్రారంభించాలని అప్పటి సీఎండీ ఎన్.శ్రీధర్ టెండర్లలో పాల్గొన్న సంస్థలను కోరారు. అయితే నిర్దేశిత గడువు దాటి ఎనిమిది నెలలు పూర్తి కావొస్తున్నా పనులు ఒక కొలిక్కి రాలేదు. కేవలం మందమర్రిలో 67.50 మెగావాట్ల ప్లాంట్ పనులు ప్రారంభించడం గమనార్హం.
లక్ష్యానికి దూరంగా..
దశదిశలా విస్తరించే క్రమంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో సింగరేణి వెనుకబడిపోతోందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత 72 మిలియన్ టన్నుల లక్ష్యానికి మూడు మిలియన్ టన్నులు తక్కువగా ఉత్పత్తి అయింది. నైనీ (ఒడిశా), ఇల్లెందు (రొంపేడు), కొత్తగూడెం (పీవీకే మెగా ఓసీ)లో కొత్త గనులు అందుబాటులోకి రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు సోలార్ పవర్ విషయంలోనూ అదే జరిగింది. నిర్దేశించిన గడువులోగా సెకండ్ ఫేస్ పనులు పూర్తయితే సింగరేణికి ప్రతీ ఏడాది విద్యుత్ బిల్లుల రూపంలో దాదాపుగా రూ. 290 కోట్లు ఆదా అయ్యేవి. అలాగే నెట్‌జీరో సాధించిన సంస్థగా దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కేది. కానీ ఈ రెండూ సాధ్యం కాలేదు. ఇవి ఇలా ఉండగానే రాజస్థాన్‌తో ఒప్పందం, జియోథర్మల్ పవర్ ప్లాంట్, పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్, రేర్ ఎర్త్ మినరల్స్, విండ్ పవర్ అంటూ కొత్త రాగాలను ఆలపించడంపై విమర్శలు వస్తున్నాయి.
టార్గెట్ నెట్‌జీరో..
సింగరేణి సంస్థ ఆరు జిల్లాల పరిధిలో విస్తరించగా 18 ఓపెన్‌కాస్ట్, 22 భూగర్భ గనులు ఉన్నాయి. సుమారు 40 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. గనుల అవసరాలకు తోడు కార్మికుల సంక్షేమం కోసం సంస్థ భారీగా విద్యుత్‌ను వినియోగిస్తోంది. ప్రతీ ఏడాది వేర్వేరు అవసరాల నిమిత్తం 715 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వాడుతోంది. అయితే అంతే మొత్తంలో సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి కాలుష్య నియంత్రణలో నెట్‌జీరో సంస్థగా నిలవాలని దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తొలి విడతలో సంస్థ పరిఽధిలోని అన్ని ఏరియాల్లో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను సిద్ధం చేసింది. తద్వారా 450 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సంస్థ ఆదా చేసినట్టయింది. నెట్‌జీరో రికార్డు దిశగా అడుగులు వేస్తూ మరో 232 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల స్థాపనకు రెండేళ్ల కిందటే ప్లాన్ సిద్ధం చేసింది.