
హైవేపై రయ్.. రయ్
● చివరి దశలో ‘గ్రీన్ ఫీల్డ్’ పనులు ● ఆగస్టు 15వ తేదీకల్లా సత్తుపల్లి వరకు నిర్మాణం పూర్తి ● తద్వారా ఖమ్మం – సత్తుపల్లి మధ్య తగ్గనున్న ప్రయాణ సమయం
సత్తుపల్లి: జిల్లాలో కొత్త జాతీయ రహదారి త్వరలో నే అందుబాటులోకి రానుంది. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి(ఎన్‌హెచ్ 365 బీజీ)ని 165 కి.మీ. నిడివితో నిర్మిస్తుండగా.. ఈ హైవే జిల్లాలోనే 105 కి.మీ. ఉంటుంది. ఇందులో ఖమ్మం–సత్తుపల్లి మార్గంలో పనులు చివరి దశకు చేరుకోగా త్వరలోనే రహదారి అందుబాటులోకి రానుంది.
జిల్లాలో భేష్
గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని ఐదు ప్యాకేజీలుగా విభజించారు. జిల్లాలోని పనులు 1నుంచి 3వరకు ప్యాకేజీల్లో ఉండగా చకచకా జరగడంతో పూర్తి కావొచ్చాయి. ఏపీలోని 4, 5 ప్యాకేజీల పనులే మందకొడిగా జరుగుతున్నాయి. దేవరపల్లి క్రాస్ వద్ద మూడు కి.మీ. భూసేకరణ వివాదం కోర్టులో ఉండడంతో ఈ జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
డివైడర్లు సహా నిర్మాణం పూర్తయిన హైవే
ప్యాకేజీల వారీగా ఇలా..
●ప్యాకేజీ–1 : తల్లంపాడు నుంచి సోమవరం వరకు 33 కి.మీ. మేర రూ.772 కోట్లతో చేపట్టే పనులను ప్యాకేజీ–1గా నిర్ధారించారు. ఇందులో 30 కి.మీ. రోడ్డు నిర్మాణం పూర్తవగా, ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు అనుమతి రాకపోవడంతో ఆటంకం ఎదురైంది. ఇక 32 బ్రిడ్జిల్లో 29 నిర్మాణాలు పూర్తయ్యాయి.
●ప్యాకేజీ–2 : రూ.637 కోట్లతో ఈ ప్యాకేజీ కింద సోమవరం(వైరా) నుంచి చింతగూడెం వరకు 29 కి.మీ. నిడివితో చేపట్టారు. ఇందులో 26 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఈ మార్గంలోని 39 బ్రిడ్జిల్లో 36 బ్రిడ్జిలు నిర్మాణాలు పూర్తయ్యాయి.
●ప్యాకేజీ–3 : రూ.804 కోట్లతో చింతగూడెం నుంచి రేచర్ల(చింతలపూడి మండలం) వరకు 42 కి.మీ. నిడివితో ఈ ప్యాకేజీ కింద పనులు చేపడుతున్నారు. ఇందులో 37 కి.మీ. మేర రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అలాగే, 52 బ్రిడ్జి నిర్మాణ పనులన్నీ పూర్తి చేయడం విశేషం.