
ఎగ్జిట్లతో మెరుగైన రవాణా
జాతీయ రహదారి నిర్మాణాన్ని ఖమ్మం– సత్తుపల్లి(వేంసూరు ఎగ్జిట్) వరకు ఆగస్టు 15కల్లా పూర్తి చేయడమే లక్ష్యంగా పర్యవేక్షిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మార్గంలో వేంసూరు ఎగ్జిట్ నుంచి ధంసలాపురం వరకు రహదారి పనులను గురువారం ఆయన సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, మాలోతు రాందాస్‌నాయక్, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ కె.దివ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ రహదారి పనులు పూర్తయితే ఖమ్మం నుంచి సత్తుపల్లి మధ్య 80కిలోమీటర్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని తెలి పారు. కాగా, సత్తుపల్లి, వైరా, ఖమ్మం ప్రజల డిమాండ్ మేరకు ఎగ్జిట్లను పెంచి రహదారి సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటల ఎగుమతి కోసం జాతీయ రహదారికి అనుసంధానంగా సర్వీస్ రోడ్లను మంజూరు చేయాలని ఇప్పటికే కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఆలస్యమవుతున్నందున ఒక వైపు అయినా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, కొదుమూరు వద్ద విద్యుత్‌లైన్ సమస్య పరిష్కరిస్తున్నామని వెల్లడించిన మంత్రి... కల్లూరు సమీపాన సాగర్ కాల్వ వద్ద బ్రిడ్జి డిజైన్ మార్చడంతో పనుల్లో కొంత ఆలస్యమైందని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్డీఓ రాజేందర్‌గౌడ్, మార్కెట్ల చైర్మన్లు దోమ ఆనంద్‌బాబు, భాగం నీరజాదేవి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, సాధు రమేష్‌రెడ్డి, పసుమర్తి చందర్‌రావు, బుక్కా కృష్ణవేణి, బండి గురునాధ్‌రెడ్డి, పుచ్చకాయల సోమిరెడ్డి పాల్గొన్నారు.