
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయండి
ఖమ్మంరూరల్/కూసుమంచి: వేసవి శిక్షణ శిబిరాల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడమే కాక వారిలోని సృజనాత్మకతను వెలికితీయాలని జిల్లా విద్యాశాఖాధికారి సామినేని సత్యనారాయణ సూచించారు. ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లోని జలగంగనర్, కూసుమంచి ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న శిబిరాలను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. చదరంగం, క్యారమ్స్, యోగా, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడమేకాక అల్పాహారం, భోజనం సమకూరుస్తున్న విషయాన్ని వివరించి విద్యార్థులు ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే, విద్యార్థులు గీసిన చిత్రాలను చూసి అభినందించారు. ఎంఈఓలు శ్రీనివాస్, రాయల వీరస్వామి, హెచ్‌ఎం శ్యాంసన్‌తో పాటు ఉపాధ్యాయులు మాధవరావు, రూబీ, షాబుద్దీన్, జుబేదా, వెంకటేశ్వర్లు, జాఫర్ పాల్గొన్నారు.