
గురుకులం.. పురోగమనం
● బీసీ గురుకులాల్లో రాణిస్తున్న ఇంటర్ విద్యార్థులు ● ఇంటర్‌మీడియట్‌లో ఏడు శాతం పెరిగిన ఉత్తీర్ణత ● సీఓఈగా బోనకల్ గురుకులం అప్‌గ్రేడ్
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కార్పొరేట్ స్థాయికి మించి వసతి, భోజన సౌకర్యాలు కల్పించడమే కాక ఉచిత విద్య అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల కళాశాలల్లో ఏటేటా విద్యాప్రమాణాలు పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే గురుకులాల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం భారీగా పెరగడడం... ఇంటర్, పదో తరగతి విద్యార్థులు పలువురు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం విశేషం. గత ఏడాది గురుకులాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 82శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 89శాతానికి పెరిగింది.
ఉమ్మడి జిల్లాలో 22 కళాశాలలు
ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన 22 మహత్మా జ్యోతిబా పూలే గురుకుల కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ,సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీతోపాటు వృత్తికోర్సులు నిర్వహిసస్తూ ఒక్కో కళాశాలలో కోర్సుకు 40 సీట్లే కేటాయించారు. ఇక కొన్ని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మాత్రమే బోధన సాగుతోంది. దీంతో ప్రతీ విద్యార్థిపై శ్రద్ధ వహిస్తున్నందున ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
మెరుగైన విద్యతో ఉత్తమ ఫలితాలు
బీసీ గురుకులాల్లో ఉత్తమ బోధన అందిస్తున్నాం. నిరంతరం విద్యార్థులపై అధ్యాపకుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాం. ఏటా ఉత్తీర్ణత పెరిగేలా ప్రణాళికాయుతంగా బోధిస్తుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఏడాది బోనకల్ గురుకులం సీఓఈగా అప్‌గ్రేడ్ అయింది. భవిష్యత్‌లో మరిన్ని కళాశాలలకు అవకాశం దక్కుతుంది.
– సీహెచ్.రాంబాబు,
ఆర్‌సీఓ, బీసీ గురుకులాలు
సీఓఈగా బోనకల్
బీసీ గురుకులాల్లో ఇప్పటి వరకు సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ)గా హైదరాబాద్‌లోని ఒక్క గురుకులాన్నే అప్‌గ్రేడ్ చేశారు. ఇటీవల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయ సంస్థ రాష్ట్రంలోని మరో తొమ్మిది గురుకులాలను సీఓఈలుగా అప్‌గ్రేడ్ చేయగా.. జాబితాలో ఖమ్మం జిల్లా బోనకల్ గురుకులానికి కూడా చోటు దక్కింది. దీంతో ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు ఎప్‌సెట్, జేఈఈ, ఐఐటీ శిక్షణ అందనుంది. ఇంటర్ విద్యతోపాటు ఉన్నత విద్యావకాశాలు కల్పించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ గురుకులాల్లోనే సీఓఈలు ఉండగా.. తాజాగా బీసీ గురుకులాలకు కూడా అప్‌గ్రేడ్ చేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గురుకులం.. పురోగమనం