
ఎల్‌డబ్ల్యూఈ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత
● ఉమ్మడి జిల్లాలో మూడు పార్క్‌ల అభివృద్ధి ● అటవీ శాఖ అధికారులతో భేటీలో మంత్రి తుమ్మల
ఖమ్మంవన్‌టౌన్: ఉమ్మడి జిల్లాలోని అటవీ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం, పార్క్‌ల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ సునీత, పీసీసీఎఫ్ సువర్ణతో హైదరాబాద్‌లో మంగళవారం సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. ఇప్పటికే ఎల్‌డబ్ల్యూఈ నిధులతో అటవీ ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి అనుమతి జారీ చేయాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను కోరినట్లు తెలిపారు. ఇందులో భాగంగా అడవులను సంరక్షిస్తూనే ఉమ్మడి జిల్లాలో ఆరు రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పడమటి నర్సాపురం – అన్నారుపాడు, పాత అంజనాపురం – బేతంపూడి, కొమ్ముగూడెం – రాఘవాపురం, హేమచంద్రాపురం – జూబ్లీపురం గుట్ట, వెంకటాతండా – కుంట్ల, కొత్తపల్లి – ఏపీ సరిహద్దు వరకు రహదారులు నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే, ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్, సత్తుపల్లి, తల్లాడ మండలం కనిగిరి హిల్స్ ఎకో టూరిజం, కొత్తగూడెంలో ఎకోపార్క్ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఇవికాక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ఆదాయం పెంచేలా ఉపాధి శిక్షణ ఇవ్వడంతో పరికరాలు సమకూర్చాలని, పోడు భూముల్లో వెదురుసాగుకు శ్రీకారం చుట్టాలని మంత్రి తెలిపారు. తద్వారా వారికి మెరుగైన ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.