
పర్యాటక ప్రాంతాలుగా అడవుల అభివృద్ధి
● ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ● నీలాద్రి అర్బన్‌పార్క్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం
సత్తుపల్లి: ఉమ్మడి జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సూచించారు. సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్‌పార్క్‌లో ఫెడల్ బోటింగ్, లైబ్రరీ, ఆర్వో ప్లాంట్, ఎన్‌ఐఎఫ్ మిషన్, వీఎస్‌ఎస్ సభ్యులకు ఉపాధి యంత్రాలను సోమవారం ఆయన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆదిలాబాద్ సమీపంలోని తిప్పేశ్వరం అటవీ పార్క్ మాదిరి సత్తుపల్లి అర్బన్ పార్క్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చించారని తెలిపారు. అలాగే, 14 వేల హెక్టార్లలో ఉన్న కనిగిరి గుట్టలను ఎకో టూరిజంలో భాగంగా అభివృద్ధి చేస్తే పర్యాటకుల రాక పెరుగుతుందని, ఆపై గిరిజనులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కాగా, అటవీశాఖ వీఎస్‌ఎస్ సభ్యులకు ఉపాధి యంత్రాలను అందించడం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో రాజీవ్ యువశక్తి పథకం ద్వారా యంత్రాల పంపిణీ, మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ అడవిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం ఆనందదాయకమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఛీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డి.బీమానాయక్, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, ఎఫ్‌డీఓ వాడపల్లి మంజుల, మున్సిపల్ కమిషనర్ కు.నర్సింహ, రేంజర్ ఉమ, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, దోమ ఆనంద్, గాదె చెన్నారావు, తోట సుజలరాణి, కమల్‌పాషా, దొడ్డా శ్రీనివాసరావు, వందనపు సత్యనారాయణ, మెప్మా టీఎంసీ సుజాత, దీపక్ రామాయణ్ తదితరులు పాల్గొన్నారు.