
వాహనం కదలదు.. కల్తీ ఆగదు...
● రోడ్డెక్కని ఆహార తనిఖీ వాహనం ● అయినా ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్‌కు వేతనాలు ● జిల్లాలో కల్తీ ఆహారంపై కొరవడుతున్న నియంత్రణ
ఖమ్మంమయూరిసెంటర్: ఆహారంలో నాణ్యత పరిశీలన, అక్కడికక్కడే తనిఖీలు చేపట్టేందుకు వినియోగించాల్సిన టెస్టింగ్ ల్యాబ్ వాహనం ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని చెత్త వాహనాల పార్కింగ్ స్థలానికే పరిమితమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో తనిఖీలు, కల్తీ ఆహారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 కోట్లతో ఈ వాహనాన్ని కేటాయించింది. ఖమ్మం కేంద్రంగా జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో దీన్ని వినియోగించాల్సి ఉండగా, నెలల తరబడి బయటకు తీయడం లేదు. అంతేకాక డ్రైవర్, టెక్నీషియన్‌కు నెలనెలా వేతనాలు ఇస్తుండడం గమనార్హం.
అప్పుడప్పుడు.. గుర్తొచ్చినప్పుడే
కల్తీ ఆహారం, కల్తీ పదార్థాలకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర ప్రభుత్వం మైక్రో బయాలజీ ల్యాబ్ యూనిట్ కలిగిన స్పాట్ కల్తీ టెస్టింగ్ మొబైల్ వాహనాన్ని జిల్లాకు కేటాయించింది. 2022 జూలైలో ఈ వాహనం చేరుకోగా, ఇప్పటి వరకు అధికారులు సక్రమంగా వినియోగించలేదు. ఏటా ఒకసారి, లేదా అధికారులకు గుర్తుకొచ్చినప్పుడు బయటకు తీసి అదే రోజు మూలన పెడుతున్నారు. ఈ వాహనానికి కేటాయించిన డ్రైవర్, ల్యాబ్ టెక్నీషియన్‌కు మాత్రం నెలనెలా ప్రభుత్వం నుంచి వేతనాలు ఇస్తూ, వాహనం డ్రైవర్‌ను ఓ అధికారి తన సొంత వాహనానికి ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది.
కల్తీని కనిపెట్టేలా..
కల్తీ ఆహారంపై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు అందినప్పుడు అధికారులు మైక్రో బయాలజీ ల్యాబ్ యూనిట్ కలిగిన వాహనం ద్వారా క్షేత్రస్థాయికి చేరుకోవాలి. అక్కడికక్కడే అనుమానిత ఆహార పదార్థాలను తనిఖీ చేసి కల్తీని నిర్ధారించాల్సి ఉంటుంది. అంతేకాక ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేలా ఇందులోని ప్రొజెక్టర్లు, పిక్చర్ వాల్స్ వినియోగించాలి. వీటికి తోడు వ్యాపారులకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ మంజూరుకు కూడా అవకాశముంది. ఈ వాహనంలో జనరేటర్‌తో పాటు సేకరించిన శాంపిళ్లు చెడిపోకుండా ఆధునిక పరికరాలు, ఏసీలు ఏర్పాటు చేసినా కొన్ని పరికరాలు పని చేయడంలేదని తెలిసింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈ వాహనాన్ని వినియోగించాల్సి ఉన్నా కనీసం ఖమ్మంలో ఫిర్యాదులు అందినప్పుడు కూడా పరీక్షలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
అవగాహన శూన్యం
జిల్లాలో ఆహార కల్తీపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు కల్తీ ఆహారాన్ని పరీక్షించడంపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. అడపా దడపా హోటళ్లు, దుకాణాల్లో తనిఖీ చేస్తున్నా అవగాహన కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమైనట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో కల్తీ ఆహారం వెలుగులోకి వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశంపై ప్రజలకు తెలిచడం లేదు. ఈ విషయమై జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను వివరణ కోరగా.. వాహనాన్ని తిప్పుతున్నామని, టెక్నీషియన్, డ్రైవర్లకు నెలనెలా వేతనాలు ఇస్తున్నామని చెప్పడం గమనార్హం.