
ప్రణాళికాయుతంగా భూసేకరణ
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం సహకారనగర్: సీతారామ ఎత్తిపోతల పథకం, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం తదితర పనులకు ప్రణాళికాయుతంగా భూసేకరణ చేపట్టాలని, తద్వారా అభివృద్ధి పనుల్లో వేగం పెరుగుతుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి భూసేకరణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకానికి అటవీ భూమి ఎంత సేకరించాలో నివేదిక ఇస్తే ప్రత్యామ్నాయ భూముల్లో అటవీ పెంపకానికి చర్యలు తీసుకుంటామన్నారు. భూముల సర్వేను ఆధునిక యంత్రాలతో చేపట్టేలా నివేదిక ఇవ్వాలని సూచించారు. అలాగే, మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం, నిర్వాసితుల కోసం లేఔట్ కాలనీకి ఏర్పాటుకు భూమి సేకరించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు
ప్రజలు ఇచ్చే ప్రతీ ఫిర్యాదు, వినతిపత్రాన్ని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు.
భూసమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు
రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి అందిన భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పైలట్ మండలాలుగా ఎంపికై న మండలాలకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భూ సమస్యలపై అందిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని, ఏదైనా దరఖాస్తు తిరస్కరిస్తే అందుకు కారణాలు తెలియజేయాలన్నారు. జిల్లా నుంచి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి వీసీలో పాల్గొనగా కలెక్టర్ మాట్లాడుతూ నేలకొండపల్లి మండలంలో 3,224 దరఖాస్తులు రాగా, వీటి పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. వారం నుంచి పది రోజుల్లో పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈసమావేశాల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.రాజేశ్వరి, డీఆర్వో పద్మశ్రీ, డీఆర్‌డీఓ సన్యాసయ్య, ఆర్డీఓలు జి.నర్సింహారావు, ఎల్.రాజేందర్‌గౌడ్, ఇరిగేషన్ ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.