
‘ఉద్దీపకం’తో సత్ఫలితాలు
● గతేడాది 3,4,5 తరగతుల విద్యార్థులకు పంపిణీ ● రానున్న ఏడాది 1, 2వ తరగతుల్లో అమలుకు ప్రణాళికలు ● ప్రాఽథమిక విద్య పటిష్టతపై పీఓ దృష్టి
భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ పరిఽధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో, వసతి గృహాల్లో ప్రాథమిక విద్య పటిష్టతకు పీఓ చేపట్టిన ప్రయోగం ఫలించింది. గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో గిరిజన విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దీపకం అభ్యాసన పుస్తకాలు అందించారు. మెరుగైన ఫలితాలు కనిపించడంతో ఈయేడాది మిగతా తరగతులకు కూడా అందించాలని భావిస్తున్నారు.
విద్యార్థుల్లో వెనుకబాటును గుర్తించి..
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యపై అవగాహన ఉన్న బి.రాహుల్ ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టాక ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించారు. గిరిజన విద్యార్థులతో మమేకమై వారి ప్రతిభా పాటవాలను పరిశీలించారు. ప్రాథమిక విద్యలో వారి వెనుకబాటుతనాన్ని గుర్తించారు. గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానం లేకపోవడంతో ప్రాథమిక విద్య పటిష్టతకు చర్యలు చేపట్టారు.
పునాది బలపడేలా ‘ఉద్దీపకం’
ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల సామర్థ్యాలు బలంగా ఉండేందుకు ఉద్దీపకం పేరిట ప్రత్యేక అభ్యాసన పుస్తకాలను తీసుకొచ్చారు. ఇందుకోసం పీఎంఆర్‌సీ ఆధ్వర్యంలో నిపుణులైన ఉపాధ్యాయులతో ప్రత్యేక పుస్తకాలను సిద్ధం చేయించారు. తొలి విడతగా 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. గణితంలో కూడిక, తీసివేత, భాగహారం, హెచ్చివేతల ఆవశ్యకత, వాటిని సులువుగా వినియోగించటం, లెక్కల ప్రశ్నలను సులువుగా సాధించడం, ఉన్నత విద్యకు ప్రాథమిక స్థాయిలో గణితం పునాది, నిత్య జీవితంలో లెక్కలను వినియోగించడం వంటి అంశాలపై వర్క్‌షీట్లతో బుక్‌లను సిద్ధం చేయించారు. ఇంగ్లిష్‌లో గ్రామర్‌పై పట్టు, సులువుగా వాక్యాల కూర్పు, పద వినియోగం పెంపు, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ పెంచే విధంగా రూపొందించారు. ఇంగ్లిష్ నిర్భయంగా మాట్లాడేలా అవసరమైన ప్రాఽథమిక పరిజ్ఞానాన్ని ఈ వర్క్‌షీట్లలో పొందుపర్చారు.
సత్ఫలితాలతో 1,2 తరగతులకు అమలు
2024లో పాఠశాలల ప్రారంభం సమయానికి వర్క్‌బుక్‌లను సిద్ధం చేయించి 3,4,5 తరగతుల విద్యార్థులకు అందించారు. ఆశ్రమ పాఠశాలలను సందర్శిస్తూ బోధనా తీరును పర్యవేక్షించారు. ఉద్దీపక పుస్తకాలతో సత్ఫలితాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది 1, 2వ తరగతులకు కూడా ఉద్దీపనం పుస్తకాలు ఇవ్వాలని భావిస్తున్నారు. సబ్జెక్టు టీచర్లు, ప్రధానోపాధ్యాయులతో సమీక్షించి వర్క్‌షీట్లు సిద్ధం చేయాలని సూచించారు. తుది పరిశీలన అనంతరం ఆమోదించి పుస్తకాల రూపంలోకి తీసుకురానున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి పాఠశాలల పునః ప్రారంభం సమయంలోనే పుస్తకాలు అందించాలనే కృతనిశ్చయంతో ఐటీడీఏ అధికారులు దృష్టి సారించారు.

‘ఉద్దీపకం’తో సత్ఫలితాలు