
నల్లచట్టాలతో రైతులకు నష్టం
కొణిజర్ల : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్టాలతో రైతులు నష్టపోతున్నారని, వీటిని నిరసనగా రైతులతో పాటు కార్మికులు కూడా ఉద్యమిస్తున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. ఇటీవల భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో చర్చల ద్వారా సమస్య పరిష్కరించాలని కమ్యూనిస్టులు సూచిస్తే దేశ ద్రోహులుగా చిత్రకరించేందుకు కొందరు ప్రయత్నించారని ఆరోపించారు. మండలంలోని లాలాపురంలో సీపీఎం నాయకుడు సంక్రాంతి మధుసూదనరావు సంస్మరణ సభ ఆదివారం నిర్వహించగా రాఘవులు మాట్లాడారు. యుద్ధంతో తీవ్ర నష్టాలు ఉంటాయని, రెండు దేశాల మధ్య సయోధ్యతో యుద్ధాన్ని నివారించొచ్చని కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని పార్టీలన్నీ చెప్పాయన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కమ్యూనిస్టులు లేకపోతే దేశానికి భవిష్యత్ ఉండదనే చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతన్న ముఖ్యమంత్రే రూ.వేలకోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ తాను కాంగ్రెస్ వాదినైనా మధుసూదనరావు ఆలోచనా విధానాన్ని అవలంబించేవాడినని తెలిపారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్, సాయిబాబా, నున్నా నాగేశ్వరరావు, భూక్యా వీరభద్రం, బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు