
గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
తల్లాడ: రెక్కాడితే గానీ డొక్క నిండని కుటుంబం.. దంపతులిద్దరూ బ్యాంకులో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఇద్దరు కుమార్తెలను కష్టపడి చదివిస్తున్నారు. ఇంతలోనే ఆ తల్లిదండ్రులు పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన అయిలూరి శేషిరెడ్డి – కృష్ణకుమారి దంపతుల చిన్న కుమార్తె భావన (22) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె శనివారం ఉదయం కళాశాల హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు కారణాలు తెలియరావాల్సి ఉండగా, విషయం తెలియగానే స్థానికంగా విషాదం నెలకొంది. కాగా, భావన 1 నుంచి పదో తరగతి వరకు కల్లూరు ప్రతిభ స్కూల్‌లో, ఇంటర్ ఖమ్మం శ్రీ చైతన్య కళాశాలలో ఉత్తమ మార్కులతో పూర్తిచేసింది. గురునానక్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా, మొదటి రెండేళ్లు మంచి మార్కులే సాధించింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ విషయం తెలియగానే ఆమె తల్లిదండ్రుల కన్నీరుమున్నీరయ్యారు.
ఎలుకల మందు తాగి వ్యక్తి..
ఖమ్మంరూరల్: మండలంలోని ముత్తగూడెంనకు చెందిన చెరుకుపల్లి నాగేశ్వరరావు (41) ఎలుకల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బాధ తట్టుకోలేక ఈనెల 9న ఇంట్లో ఎవరూ లేని సమయాన ఎలుకల మందు తాగాడు. అనంతరం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందగా, నాగేశ్వరరావు సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
కుర్నవల్లి గ్రామంలో విషాదం