
‘సిందూర్’ విజయవంతం కావాలని పూజలు
ఎర్రుపాలెం/కూసుమంచి: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులను తుదముట్టించేలా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతి హోమం చేసిన అర్చకులు, భారత సైన్యానికి మేలు జరగా లని, వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలని పూజలు జరిపించారు. ఆలయ ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్‌శర్మ, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు తల్లపురెడ్డి నాగిరెడ్డి, శీలం శ్రీనివాసరెడ్డి, గుడేటి బాబురావు, శ్రీనివాసరావు, ఎన్.రామారావు పాల్గొన్నారు. అలాగే, కూసుమంచిలోని శివాలయంలోకూడా పూజలు చేయగా, ఈఓ శ్రీకాంత్, భక్తులు పాల్గొన్నారు.
లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా శిక్షణకు దరఖాస్తులు
ఖమ్మంసహకారనగర్: లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా శిక్షణ కోసం ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యాన శిక్షణ ఇవ్వనుండగా, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మీ సేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి ఈనెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్మీడియట్‌లో గణితం సబ్జెక్టుగా 60శాతం మార్కులు సాధించిన వారు, ఐటీఐ డ్రాఫ్ట్‌మెన్(సివిల్), డిప్లొమా(సివిల్), బీటెక్(సివిల్) లేదా సమానమైన విద్యార్హత ఉన్న వారు అర్హులని వెల్లడించారు. ఎంపికై న అభ్యర్థుల్లో ఓసీలైతే 50రోజుల శిక్షణకు రూ.10వేలు, బీసీలు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వివరాలకు 83748 79945, 97054 39983, 96769 64860 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
31వరకు ఓపెన్ వర్సిటీ ఫీజు గడువు
ఖమ్మంసహకారనగర్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఏ, బీకాం, బీఎస్సీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్షలకు అభ్యర్థులు ఈనెల 31లోగా ఫీజు చెల్లించాలని ఖమ్మం రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ బి.వీరన్న సూచించారు. వివరాలు, ఫీజు చెల్లింపు కోసం www.braouonline.ac.in వెబ్‌సైట్‌లో పరిశీలించాలని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
వైద్యసేవల్లో నిర్లక్ష్యం వద్దు
● కల్లూరు ఆస్పత్రిలో కలెక్టర్ తనిఖీ
కల్లూరు: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంగా వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలే తప్ప నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆదేశించారు. కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా డాక్టర్ వినీత్ పలువురికి చికిత్స చేస్తుండగా పరిశీలించారు. అనంతరం ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్‌తో మాట్లాడి పరీక్షలు, మందుల లభ్యతపై ఆరాతీశారు. మందులు సరి పడా సిద్ధంగా ఉంచుకోవాలని, ఏవైనా తక్కువగా ఉంటే ముందుగానే తెప్పించుకోవాలని సూచించారు. తహసీల్ధార్ పులి సాంబశివుడు, వైద్యాధికారి నవ్యకాంత్, ఉద్యోగులు ఎం.లలిత, జె.మాధవి, అనూష, అక్తర్, మధు, బి.కృష్ణవేణి పాల్గొన్నారు.
ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు
పెనుబల్లి: రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. పెనుబల్లి మండలం మండాలపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, రవాణాపై ఆరా తీశాక కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కాంటా వేయించి మిల్లులకు తరలించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య, తహసీల్దార్ గంటా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

‘సిందూర్’ విజయవంతం కావాలని పూజలు