రండి.. డిగ్రీలో చేరండి | - | Sakshi
Sakshi News home page

రండి.. డిగ్రీలో చేరండి

May 10 2025 12:23 AM | Updated on May 10 2025 12:23 AM

రండి.

రండి.. డిగ్రీలో చేరండి

‘దోస్త్‌’ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
● ఈనెల 21వరకు మొదటి విడత.. ● ఆతర్వాత మరో రెండు విడతలు కూడా.. ● ఉమ్మడి జిల్లాలోని 11 ప్రభుత్వ కాలేజీల్లో 5,820 సీట్లు

ఖమ్మంసహకారనగర్‌: ఇంటర్‌మీడియట్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంజనీరింగ్‌, ఫార్మసీ, మెడిసిన్‌ కోర్సుల్లో విద్యార్థులు ఆ వైపు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అయితే, కాలం మారుతున్నా వన్నె తగ్గని డిగ్రీ కోర్సుల్లోనూ చేరేందుకు ఇంకొందరు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రభుత్వం ఏటా మాదిరిగానే డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దోస్త్‌(డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) ద్వారా రిజిస్ట్రేషన్ల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతల షెడ్యూల్‌ అమల్లో ఉన్న నేపథ్యాన ఉమ్మడి జిల్లాలో డిగ్రీ కళాశాలలు, సీట్లు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వివరాలపై కథనం

2వ తేదీన నోటిఫికేషన్‌

రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం షెడ్యుల్‌ను ఈనెల 2వ తేదీన విడుదల చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి దోస్త్‌ రిజిస్ట్రేషన్లు మొదలుకాగా, డిగ్రీ బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీబీఎం తదితర కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. విద్యార్థులు నేరుగా దోస్త్‌ వెబ్‌సైట్‌లోనే కాక మీ సేవ, దోస్త్‌ యాప్‌, ఆన్‌లైన్‌ సర్వీసెస్‌లోనూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. మూడు విడతలుగా కొనసాగే ప్రవేశాల ప్రక్రియ కోసం విద్యార్థులు తమకు ఇష్టమైన కళాశాల, కోర్సును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఖమ్మం జిల్లాలో ఐదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలే కాక పలు ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి.

మూడు విడతల్లో ఇలా...

●‘దోస్త్‌’మొదటి విడత రిజిస్ట్రేషన్‌ ఈనెల 3వ తేదీన మొదలుకాగా, 21వ తేదీ వరకు రూ.200 రుసుంతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 10నుంచి 22వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశముండగా, 29వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. ఆయా విద్యార్థులు ఈనెల 30నుంచి జూన్‌ 6తేదీ వరకు కళాశాలల్లో రిపోర్టింగ్‌ చేసి నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

● రెండో విడత రిజిస్ట్రేషన్‌కు రూ.400 ఫీజు చెల్లించాలి. ఈనెల 30నుంచి జూన్‌ 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండగా, ఈనెల 30నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకుంటే అదే నెల 13న సీట్లు కేటాయిస్తారు. ఈ విడతలో సీట్లు దక్కిన విద్యార్థులు వచ్చే నెల 13 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించాలి.

● మూడో విడత రిజిస్ట్రేషన్‌లోనూ రూ.400 ఫీజుతో వచ్చే నెల 23న ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అదేరోజు నుంచి వచ్చేనెల 28వ తేదీ వరకు రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. కాగా, 1, 2, 3 విడతల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసిన విద్యార్థులంతా జూన్‌ 24 నుంచి 28వ తేదీల్లో ఆయా కళాశాలల్లో జరిగే ఓరిఝెంటేషన్‌ కార్యక్రమాల్లో పాల్గొని, 30న ప్రారంభమయ్యే తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్‌కు ఏమేం కావాలి?

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ సమయాన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం హాల్‌టికెట్‌ నంబర్‌, ఆధార్‌కార్డు జిరాక్స్‌, ఆధార్‌ కార్డుకు లింక్‌ అయిన ఫోన్‌ నంబర్‌, ఎస్సెస్సీ, ఇంటర్‌ మెమోలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు 6నుంచి ఇంటర్మీడియట్‌ వరకు స్టడీ సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలు, ఇంటర్‌ టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో కూడా సమర్పించాలి.

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, సీట్ల సంఖ్య

కళాశాల సీట్లు

ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌, ఖమ్మం 1,560

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఖమ్మం 480

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మధిర 300

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నేలకొండపల్లి 300

జేవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సత్తుపల్లి 480

శ్రీరామచంద్ర ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌

కళాశాల, కొత్తగూడెం 360

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాల్వంచ 660

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భద్రాచలం 780

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇల్లెందు 300

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మణుగూరు 360

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అశ్వారావుపేట 240

సద్వినియోగం చేసుకోవాలి

డిగ్రీలో ప్రవేశాల కోసం విద్యార్థులు ‘దోస్త్‌’వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. మూడు విడతలుగా అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే నచ్చిన కాలేజీ, కోర్సును ఎంచుకోవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– ఎం.డీ.సలీంపాషా, దోస్త్‌ కో ఆర్డినేటర్‌, ఖమ్మం

రండి.. డిగ్రీలో చేరండి1
1/1

రండి.. డిగ్రీలో చేరండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement