
వీడని వర్షం, ఈదురుగాలులు
● జిల్లాలో పగలంతా ఎండ, సాయంత్రానికి మార్పు ● ధాన్యం కాపాడుకునేందుకు రైతల అవస్థలు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి కారణంగా కొద్ది రోజులుగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. పగలు ఎండ తీవ్రత ఉంటుండగా.. సాయంత్రానికి 30 – 40 కి.మీ. మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వడగండ్లతో కూడిన వర్షం కురుస్తోంది. గురువారం సాయంత్రం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం అత్యధికంగా నేలకొండపల్లిలో 41.2, బాణాపురంలో 41, పమ్మిలో 40.9, చింతకానిలో 40.7, కాకరవాయి, బచ్చోడులలో 40.5, రఘునాథపాలెంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సాయంత్రం 7గంటల సమయానికి సత్తుపల్లి ఓసీ వద్ద 16, వైరా ఏఆర్‌ఎస్ వద్ద 14.8, ఏన్కూరులో 14, తిమ్మారావుపేటలో 12.8, బచ్చోడులో 9.8, మధిరలో 8.5, గుబ్బగుర్తిలో 4.5, మధిర ఏఆర్‌ఎస్ వద్ద 3.8, గేటు కారేపల్లి వద్ద 3.3, కాకరవాయిలో 3 మి.మీ. వర్షపాతం నమోదైంది. కాగా, ఈదురుగాలులు, అకాల వర్షాలతో యాసంగి పంటలు సాగు చేసిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, మక్కలు, మిర్చిని కాపాడుకునేందుకు అవస్థ పడుతుండగా.. కోత దశలో మామిడి పంట నేలరాలుతుండగా ఆవేదన చెందుతున్నారు. ఇక ఈదురుగాలులు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది.
●ఏన్కూరు: మండలంలో గురువారం సాయంత్రం భారీవర్షం కురిసింది, గాలిదుమారం, ఉరుములు, మెరుపులతో భారీవర్షంతో ధాన్యం కప్పిన పరదాలు ఎగిరిపోయాయి. గాలివాన భీభత్సంతో అక్కడక్కడా చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి.
●తల్లాడ: తల్లాడ మండలంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసింది. గన్నీ సంచులు, లారీల కొరతతో కొనుగోళ్లు ఆలస్యమవుతుండగా, వర్షంతో నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు.
●ఎర్రుపాలెం: మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. జమలాపురం వెళ్లే రహదారి, మండల కేంద్రంలోని బైపాస్ ,మీనవోలు – మధిర రోడ్డులో చెట్లు విరిగి రహదారికి అడ్డంగా పడగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే, మామిడితోటల్లో కాయలు నేలరాలగా, గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

వీడని వర్షం, ఈదురుగాలులు