
గాలివాన బీభత్సం
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం గాలి, వాన బీభత్సం సృష్టించింది. పగలంతా ఎండ తీవ్రత ఉండగా, సాయంత్రం 4–30 గంటల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోనే కాక కొణిజర్ల, వైరా, తల్లాడ, మధిర మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించగా.. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్ల కొమ్మలు రహదారులు, విద్యుత్ లైన్లపై విరిగిపడ్డాయి. ఈ కారణంగా అటు రాకపోకలు, ఇటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతేకాక పలుచోట్ల కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోయాయి. – ఖమ్మం వ్యవసాయం
● గంట పాటు జిల్లాలో ఆగమాగం ● రోడ్లపై విరిగిపడిన చెట్లతో ఆగిన రాకపోకలు ● కల్లాల్లో తడిసి ముద్దయిన ధాన్యం
విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఈదురుగాలుల కారణంగా ఖమ్మం నగరంతో పాటు వైరా, కొణిజర్ల, మధిర, ఖమ్మం రూరల్ మండలం, తిరుమలాయపాలెం, కామేపల్లి, కారేపల్లి, రఘునాథపాలెం, పెనుబల్లి, ఏన్కూరు తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడడంతో సాయంత్రం 5 గంటల నుంచి సరఫరా నిలిచిపోయింది. ఖానాపురం, టేకులపల్లి, జిల్లా ఆస్పత్రి, మంచుకొండ, ఇల్లెందు క్రాస్, ప్రకాష్‌నగర్ సబ్ స్టేషన్ల పరిధిలో ఫీడర్లు దెబ్బతిన్నాయి. ప్రకాష్‌నగర్‌లో ఓ గోదాం రేకులు లేచిపోయి 11 కేవీ విద్యుత్ లైన్‌పై పడటంతో సమీప ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈమేరకు విద్యుత్ శాఖ ఉద్యోగులు పునరుద్ధరణ పనులు చేపడుతూనే ఇంటర్ లికింగ్ విధానం అమల్లో ఉన్న ప్రాంతాల్లో ఇతర సబ్‌స్టేషన్ల నుంచి సరఫరా ఇచ్చారు. అయినా ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో రాత్రి పొద్దుపోయే వరకు కూడా విద్యుత్ సరఫరా జరగలేదు.
కూలిన చెట్లు, ఎగిరిపోయిన పైకప్పులు
ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రహదారుల వెంట చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే, పలుచోట్ల హోర్డింగ్‌లు విరిగి పడగా, ఫ్లెక్సీలు తెగిపోవడంతో పాటు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఇక వర్షం మొదలుకాగానే కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. అప్పటికే పలుచోట్ల ధాన్యం తడవగా, మిగిలిన ధాన్యం పట్టాలు కప్పి రక్షించుకున్నారు.
అన్నదాతపై పగ
రైతులపై ఈ ఏడాది ప్రకృతి పగబట్టినట్లుగానే పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిరోజులుగా ఈదురుగాలులు, అకాల వర్షాలతో యాసంగి పంటలకు నష్టం జరుగుతోంది. వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతినడమే కాక ఈదురుగాలులకు మామిడి, బొప్పాయి తోటలు ధ్వంసమవుతున్నాయి. ఇటీవల జిల్లాలో దాదాపు 1,776 రైతులకు చెందిన 3212 ఎకరాల్లో వరి, మొక్కజొన్నతో పాటు మరో 200 ఎకరాల్లో మామిడి, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు.
మరికొన్ని ఫొటోలు – 9లో
పగలంతా ఎండ, సాయంత్రం వాన
జిల్లాలో మంగళశారం సాయంత్రం వరకు ఎండ దంచికొట్టగా ఆతర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. ముదిగొండ మండలం పమ్మిలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, పెనుబల్లిలో 40.8, బాణాపురంలో 40.7, బచ్చోడు, నేలకొండపల్లిలో 40.4, చింతకానిలో 40.3, ఖమ్మం ఖానాపురం, ఎరర్రుపాలెంలో 39.7, వైరా ఏఆర్‌ఎస్, మధిరలలో 39.6, కాకరవాయిలో 39.5, పల్లెగూడెం, మధిర ఏఆర్‌ఎస్‌లో 39.4, కర్నులు, కుర్నవల్లి, వైరా, తల్లాడలో 39.3, వేంసూరులో 39.2, సిరిపురంలో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సాయంత్రం తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో 30.3 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 26, ఖమ్మం ఖానాపురంలో 11.8, గుబ్బగుర్తిలో 11.3, కాకరవాయిలో 8.5, వైరాలో 5.5, తిమ్మారావుపేటలో 5 మి.మీ. వర్షపాతం నమోదైంది.

గాలివాన బీభత్సం

గాలివాన బీభత్సం

గాలివాన బీభత్సం