విలువైన సొత్తు.. చోరీకి అదును | - | Sakshi
Sakshi News home page

విలువైన సొత్తు.. చోరీకి అదును

May 6 2025 12:38 AM | Updated on May 6 2025 12:40 AM

● ఖమ్మం కేబుల్‌ బ్రిడ్జి సామగ్రిపై దొంగల కన్ను ● ఇటీవల అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డుపై దాడి

ఖమ్మంక్రైం: ఖమ్మంలోని కాల్వొడ్డులో మున్నేటిపై కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం నిర్మాణ సంస్థ సమకూర్చుకున్న సామగ్రిపై దొంగల కన్ను పడింది. ఈ ప్రాంతంలో విలువైన సామగ్రి తరచుగా చోరీ అవుతుండడంతో నిర్మాణ సంస్థ ప్రతినిధులు, సెక్యూరిటీ సిబ్బందికి తలనొప్పిగా మారింది. వర్షాలు వస్తే మున్నేటిలో వరద పెరిగి నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడుతుందనే భావనతో ఇటీవల భారీగా సామగ్రిని సమకూర్చుకుని పనుల్లో వేగం పెంచారు. ఈ ప్రాంతంలో పలువురు సెక్యూరిటీ గార్డులను నియమించినా, వారి కళ్లుగప్పుతున్న కొందరు చోరీ చేస్తున్నారు. అయితే, ఇక్కడ సామగ్రి చోరీపై ఖమ్మం త్రీటౌన్‌, రూరల్‌ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు సైతం చేశారు. దీంతో అనుమానితులను పట్టుకుని విచారించగా సమీప ప్రాంతానికి చెందిన అకతాయిలుగా గుర్తించినట్లు సమాచారం. అయితే, కేసు నమోదు చేయకుండా వారి తరఫున కొందరు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తుండడంతో చోరీలు సర్వసాధారణమయ్యాయి.

సెక్యూరిటీ గార్డ్‌పై కత్తులతో దాడి...

ఇదిలా ఉండగా గతవారం చోరీ వచ్చిన కొందరు వ్యక్తులు అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డుపై కత్తులతో దాడి చేశారు. నిర్మాణ ప్రాంతం నుంచి విలువైన సామగ్రిని ఎత్తుకెళ్తుండగా బిహార్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు అశుతోష్‌కుమార్‌ రాయ్‌ అడ్డుకున్నాడు. దీంతో ఆయనపై కత్తులతో దాడి చేసిన వారు, తమ వెంట పడకుండా తొడపై తీవ్రగాయం చేశారు. ఈ సమయాన అశుతోష్‌ కేకలు వేయగా మిగతా సిబ్బంది వచ్చే సరికి పారిపోయారు. దీంతో క్షతగాత్రుడిని సూపర్‌వైజర్‌ కోటి జిల్లా ఆస్పత్రిలో చేర్పించడమే కాక త్రీటౌన్‌పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. ఓపక్క వర్షాలు వచ్చేలోగా ఎక్కువ శా తం పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉండగా.. వరుస చోరీలతో ఎటూ పాలుపోలేని పరిస్థితి ఎదురవుతోందని వాపోతున్నారు.

విలువైన సొత్తు.. చోరీకి అదును1
1/1

విలువైన సొత్తు.. చోరీకి అదును

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement