నష్టపోయిన రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

May 4 2025 6:17 AM | Updated on May 4 2025 6:17 AM

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ఖమ్మంమామిళ్లగూడెం: ఇటీవల అకాల వర్షాలతో వరి ధాన్యం నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సరైన సమయానికి కాంటా వేయకపోవడం, కాంటా వేసినా మిల్లులకు తరలించకపోవడంతోనే కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిచి ముద్దయిందని తెలిపారు. అంతేకాక టార్పాలిన్లు సమకూర్చకపోవడంతో మరింత నష్టపోయారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి

ఖమ్మంమామిళ్లగూడెం: ఆర్టీసీలో సమ్మె ప్రకటన చేసిన నేపథ్యాన కార్మిక సంఘాలతో ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపాలని ఆర్టీసీ ఎస్‌డబ్లు్‌ఎఫ్‌ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి, ఉపాధ్యక్షుడు ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమ్మె విషయమై స్పందించినందున, వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నారు. వేతన సవరణలో లోపాలు, ఎరియర్స్‌ చెల్లింపు, మరో రెండు వేతన సవరణలు, ఉద్యోగ భద్రత, అధికారుల వేధింపులపై చర్యలు జరపాలని వారు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

డ్వాక్రా మహిళల సొమ్ము సొంత ఖాతాలోకి...

కారేపల్లి: కారేపల్లిలోని ఓ సీఎస్‌పీ నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన వృద్ధులే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కారేపల్లి మండలం భాగ్యనగర్‌కు చెందిన భద్రకాళి స్వయం సహాయక సంఘం సభ్యురాలు తమ సంఘం ఖాతాలో 2023 మార్చి 18న రూ.25 వేలు జమ చేసేందుకు స్టేషన్‌రోడ్డులోని ఓ సీఎస్‌పీ సెంటర్‌లో సంప్రదించింది. దీంతో నిర్వాహకులు డబ్బు తీసుకుని చేతిరాతతో రశీదు ఇచ్చారు. ఆపై సభ్యులు తమ రికార్డుల్లో అప్పు రూ.25 వేలు జమ అయిందని రాశారు. కానీ ఇటీవల బ్యాంకుకు వెళ్తే రూ.25 వేల బకాయి తేలడంతో సీఎస్‌పీ నిర్వాహకురాలిని నిలదీస్తే రూ.5 వేలు మాత్రమే జమ చేసినట్లు గుర్తించారు. ఇటీవల గట్టిగా ప్రశ్నించడంతో మొత్తం డబ్బు జమ చేయగా, అందుకు సంబంధించి వడ్డీ మాత్రం సభ్యులే చెల్లించి కారేపల్లి ఎస్‌బీఐ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు.

పంచాయితీకి వెళ్లిన గ్రామపెద్దపై దాడి

చింతకాని: మామిడికాయలు కొనేందుకు వెళ్లిన దంపతులు ఘర్షణ పడగా.. చర్చించేందుకు వెళ్లిన పెద్దమనిషిపై భర్త దాడి చేసిన ఘటన ఇది. మండలంలోని నేరడ శివారు మామిడితోటలో కాయల కోసం గ్రామానికి చెందిన మేడ వెంకటయ్య – సరళ దంపతులు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో వెంకటయ్య తన భార్యను కర్రతో కొట్టాడు. దీంతో ఆమె పెద్దమనిషిగా ఉన్న కొణిజర్ల మండలం పెద్దగోపతికి చెందిన స్వర్ణ సుబ్బారావుకు ఫోన్‌లో చెప్పడంతో ఆయన తోట వద్దకు వచ్చాడు. ఈ క్రమాన సుబ్బారావును వెంకటయ్య దూషిస్తూ కర్రతో కొట్టడంతో ఆయన తల, చేతులకు గాయాలయ్యాయి. ఘటనపై సుబ్బారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగుల్‌మీరా తెలిపారు.

జిల్లా వాసి

కర్ణాటకలో మృతి

సత్తుపల్లిరూరల్‌: మండలంలోని కాకర్లపల్లికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పరిమి శ్రీనివాసరావు – శ్రీలత కుమారుడు పరిమి హేమంత్‌ (24) కర్ణాటక రాష్ట్రంలో మృతి చెందాడు. అక్కడి చిందాసి మండలంలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని బైక్‌పై వస్తుండగా ఎదురుగా కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందాడనే సమాచారంతో ఆయన తల్లిదండ్రులు కుప్పకూలారు. బంధువులు మృతదేహాన్ని తీసుకురావడానికి చిందాసి వెళ్లారు.

మైనర్‌ డ్రైవర్ల

తల్లిదండ్రులకు జరిమానా

ఖమ్మంక్రైం: ఏడుగురు మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులకు రూ.వేయి జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించిందని ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల ఖమ్మంలో చేపట్టిన తనిఖీల్లో వాహనాలు నడుపుతూ ఏడుగురు మైనర్లు పట్టుబడగా, వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చామని పేర్కొన్నారు. ఈ మేరకు వారికి జరిమానా విధిస్తూ ఖమ్మం నాలుగో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ (స్పెషల్‌ మొబైల్‌) కోర్టు న్యాయమూర్తి బి.నాగలక్ష్మి శనివారం తీర్పు చెప్పారన్నారు. అలాగే, మద్యం తాగి వాహనం నడిపిన మరో వ్యక్తికి రూ.2,500 జరిమానా విధించారని ఏసీపీ శ్రీనివాసులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement