
ఆందోళన బాటలో ఉపాధి ఉద్యోగులు
● నాలుగు నెలలుగా జీతాలు అందక అవస్థలు ● వేతనాల కోసం పెన్‌డౌన్‌తో నిరసన
ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ పథకం పనుల కల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు రాక ఆందోళన చెందుతున్నారు. మూడు నుంచి నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయని వారిలో ఆవేదన నెలకొంది. ఏడాదికాలంగా వేతనాల మంజూరులో ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని, మూడు, నాలుగు నెలలకోసారి జీతాలు విడుదల చేయడంతో విధులు నిర్వర్తించలేకపోతున్నామని వాపోతున్నారు. తాజాగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లాలో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, సిబ్బంది నిరసనలకు దిగారు. ఇప్పటికే వేతనాలు ఇప్పించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయగా.. శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతేకాక రెండు రోజుల నుంచి పెన్‌డౌన్ కార్యక్రమం చేపట్టారు.
వేతనాలతోపాటు డిమాండ్లూ పరిష్కరించాలి
వేతనాల కోసం ఆందోళన బాట పట్టిన ఉపాధి హామీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణను చేపడుతున్నారు. ఉద్యోగులు, సిబ్బందికి మూడునెలలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, వాటిని వెంటనే మంజూరు చేయడంతోపాటు పేస్కేల్‌ను స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాల సమస్య పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీటిని పరిష్కరించే వరకు తమ నిరసనలను కొనసాగిస్తామని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
సిబ్బంది పెన్‌డౌన్..
జిల్లాలో ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది పెన్‌డౌన్ చేపట్టారు. వేతనాలు చెల్లించే వరకు తాము విధులు నిర్వర్తించబోమని అధికారులకు తేల్చిచెప్పారు. జేఏసీ పిలుపు మేరకు జిల్లాలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడించారు. రెండు రోజుల నుంచి జిల్లాలో ఉపాధి హామీ ఉద్యో గులు, సిబ్బంది పెన్‌డౌన్ చేపట్టడంతో గ్రామాల్లో జరుగుతున్న పనుల పర్యవేక్షణ, కూలీల హాజరు నమోదు పూర్తిస్థాయిలో జరగడం లేదు. దీంతో పని ప్రదేశాల్లో కూలీల హాజరుతోపాటు పనుల కొలతలను నమోదు చేసే ఫీల్డ్ అసిస్టెంట్లు విధులకు దూరంగా ఉండటంతో పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులపై భారం పడుతోంది. కూలీల ను పనులకు తీసుకురావడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉపాధి సిబ్బంది విధులు నిర్వహిస్తేనే కూలీలకు పని సక్రమంగా దొరుకుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో వేతనాలు రాని సిబ్బంది
సీఓలు, ఏపీఓలు, ఈసీలు : 100 మంది
ఫీల్డ్ అసిస్టెంట్లు : 345 మంది