
తలసేమియాను తరిమేద్దాం..
ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియా వ్యాధి చిన్నారుల పాలిట శాపంగా మారకుండా తరిమికొట్టేలా అందరూ కృషి చేయాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి సూచించారు. ఖమ్మంలోని ఐఎంఏ హాల్‌లో తలసేమియా సికిల్‌సెల్ సొసైటీ ఆధ్వర్యాన శనివారం నిర్వహించిన తలసేమియా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యాధి నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రమైన విధానాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. కాగా, సొసైటీ ద్వారా చేస్తున్న సేవలను తన వంతుగా చేయూతనిస్తానని తెలిపారు. సొసైటీ వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి రత్నావళి మాట్లాడుతూ మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడే పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ పిల్లలకు బంగారు భవిష్యత్ ఇచ్చేలా ఎక్కువమంది రక్తదానం చేయాలని సూచించారు. అనంతరం తలసేమియా బాధితులు చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకోగా, డాక్టర్ యలమంచిలి నాగమణి, డాక్టర్ ఖలీగ్, ఐఎంఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంభంపాటి నారాయణరావు, కెజగదీష్‌బాబు, శివరతన్ అగర్వాల్, కిరణ్, రక్తదాతలు మిరియాల జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి