
మామిడి సస్యరక్షణ చర్యలపై అవగాహన
ఎర్రుపాలెం: మామిడి తోటలు కోత దశలో ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని మధిర వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త రుక్మిణి సూచించారు. ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెంలోని రైతు వేదికలో శనివారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సు లో ఆమె మాట్లాడారు. మామిడిలో కోతలతో పాటు ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలను వివరించారు. అలాగే, పంట అవశేషాలను కాల్చడం వల్ల ఎదురయ్యే నష్టాలపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత రైతులకు ఉద్యాన దర్శిని పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు భరత్, నాగస్వాతి, ఎ.విజయ్‌కృష్ణ, ఏఓ బి.సా యిశివ, ఉద్యాన అధికారి విష్ణు, ఏఈఓలు కృష్ణకుమారి, దుర్గాప్రసన్న పాల్గొన్నారు.
పాలేరులో వ్యాపించిన మంటలు
కూసుమంచి: మండలంలోని పాలేరు నుంచి మరిపెడ బంగ్లా వెళ్లే రహదారి పక్కన శనివారం రాత్రి మంటలు వ్యాపించాయి. రోడ్డు సమీపాన చెత్తకు నిప్పంటుకోవడం, ఆ పక్కనే ఉన్నవరి కొయ్యలకు తాకడంతో మంటలు ఉధృతమయ్యాయి. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేశారు. సమయానికి సిబ్బంది రాకపోతే పెనుప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు.