
నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్‌టౌన్/ఖమ్మం రూరల్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉద యం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత తిరుపతమ్మతల్లి ఆలయంలో పూజలు చేయనున్న మంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ మీదుగా భద్రాచలం చేరుకుంటారు. అక్కడ ఏఎంసీ కాలనీలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తారు. సాయంత్రం ఆతర్వాత భద్రాచలంలోని మనుబోతుల చెరువు వద్ద తడి, పొడి చెత్త కలెక్షన్ సెంటర్‌ను ప్రారంభించాక, కొత్తగూడెంలోని ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగే ఇఫ్తార్‌విందులో పాల్గొంటారు.
ఆరు చెక్‌డ్యాంలకు రూ.32.44 కోట్లు
కూసుమంచి: పాలేరు నియోజకవర్గంలో ఆరు చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.32,44,60,000 నిధులు మంజూరయ్యాయి. ఈమేరకు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా జేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధుల తో ఖమ్మం రూరల్ మండలం జాన్‌బాద్ తండా, చౌటవాగు తండా, కూసుమంచి మండలంలోని జక్కేపల్లి, నేలకొండపల్లి మండలంలోని చెన్నారం, పైనంపల్లి, సదాశివపాలెం వద్ద ఏటిపై చెక్‌డ్యాంలు నిర్మించనున్నారు.
రెండో రోజుకు చేరిన పరీక్షలు
ఖమ్మం సహకారనగర్: పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా హిందీ పరీక్షకు జిల్లాలో 16,386 మంది విద్యార్థులకు గాను 16,352మంది హాజరయ్యారని డీఈఓ సోమశేఖరశర్మ తెలి పారు. జిల్లా అబ్జర్వర్ నాలుగు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రెండు, ఫ్లయింగ్ స్క్వాడ్ 37 కేంద్రాలతో పాటు తాను ఎనిమిది కేంద్రాల్లో తనిఖీ చేసినట్లు వెల్లడించారు.
అభిషేకం, పల్లకీసేవ
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరి గాయి. స్వామి మూల విరాట్‌తో పాటు స్వామి వారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. అలాగే, స్వామి, అమ్మ వార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్య కల్యాణం జరిపించాక, పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన పల్లకీ సేవ నిర్వహించారు. కాగా, ఈనెల 30న ఉగాది పండుగ నుండి ఆలయంలో జరిగే వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్లను ఆలయంలో ఆవిష్కరించారు. ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ విజయకుమారి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్‌బ్యాక్‌లో రెండో స్థానం
ఖమ్మంమయూరిసెంటర్: స్వచ్ఛ సర్వేక్షణ్–2025లో ఫీడ్‌బ్యాక్ నమోదు చేసేందుకు ఖమ్మం నగర ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటివరకు 19,908 మంది వివిధ రూపాల్లో ఫీడ్‌బ్యాక్ నమోదు చేశారు. దీంతో కేఎంసీ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని అధికారులు వెల్లడించారు. చెత్త సేకరణ, తడిపొడి చెత్త నిర్వహణ, రోడ్లపై వ్యర్థాల సేకరణ, పారిశుద్ధ్య సిబ్బంది స్పందన తదితర అంశాలపై ప్రశ్నలకు ప్రజలు సమాధానాలు ఇస్తున్నారు. కాగా, ఢిల్లీకి చెందిన స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రత్యేక బృందం ఖమ్మంలోని పలు డివిజ్లనలో నాలుగు రోజుల పాటు పర్యటించింది.
‘రెవెన్యూ’లోకి వచ్చేందుకు అంగీకారం
ఖమ్మం సహకారనగర్: పూర్వ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలను గ్రామ పాలన అధికారులు(జీపీఓ)గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 10,954 జీపీఓ పోస్టులు మంజూరు చేసింది. ఈమేరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్ కోరగా జిల్లాలోని 612మంది వీఆర్‌ఏల్లో 486మంది, 312మంది వీఆర్వోల్లో 207మంది తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు అంగీకారం తెలిపారు. కాగా, ప్రభుత్వం నిర్ణయంపై గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.