● అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి ● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మంవ్యవసాయం: అర్హులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా బ్యాంకర్లు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించగా ఆయన మా ట్లాడారు. బ్యాంకర్లు ప్రభుత్వ నిర్దేశిత రుణాలను సకాలంలో మంజూరు చేయాలని తెలిపారు. 2024–25 వార్షిక రుణ ప్రణాళికలో డిసెంబర్ 2024 వరకు రూ.3,610.49 కోట్ల స్వల్పకాలిక పంట రుణాలు, రూ.1,801.04 కోట్ల వ్యవసాయ టర్మ్ రుణాలు అందాయని చెప్పారు. రానున్న కాలంలోనూ వ్యవసాయ రుణాలు సకాలంలో అందించడం ద్వారా రైతులకు అండగా నిలవాలని సూచించారు. ఇక సూక్ష్మ రుణాల కింద సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు రూ.1,569.82 కోట్లు, విద్యారుణాలుగా రూ.24.63 కోట్లు, గృహ రుణాలు రూ.73.97కోట్లు అందించారని చెప్పారు. మొత్తంగా డిసెంబర్ 2024 వరకు జిల్లాలో రూ.11,463 కోట్ల మేర బ్యాంకుల ద్వారా అందించారని, ఇదే ఒరవడి కొనసాగించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని, జిల్లాలోని 891మహిళా సంఘాలకు అందించిన రూ.17,769.95 లక్షల బ్యాంక్ లింకేజీ రుణాలతో వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని అదనపు కలెక్టర్ వెల్లడించారు. ఆతర్వాత పాడి, మత్స్య పరిశ్రమలకు రుణాల మంజూరు, డిజిటల్ సేవలపై ప్రజలకు అవగాహన తదితర అంశాలపై చర్చించగా రుణ మంజూరు, లక్ష్యాల వివరాలతో రూపొందించిన బ్రోచర్లు ఆవిష్కరించారు. ఇంకా ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరెడ్డి, ఆర్బీఐ ఎల్‌డీఓ పల్లవి, నాబార్డ్ డీడీఎం సుజిత్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ ఈడీ నవీన్‌బాబు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వాసవీరాణితో పాటు వివిధ బ్యాంకుల అధికారులు జి.లింగస్వామి, హన్మంతరెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.