● రేపటి నుంచి ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ● జిల్లాలో 97 కేంద్రాలు, 16,788మంది విద్యార్థులు ● ఈసారి అడిషనల్స్‌కు బదులు బుక్‌లెట్
అబ్జర్వర్‌గా విజయలక్ష్మీబాయి
పాఠశాల విద్యాశాఖలో డైరెక్టర్ స్థాయి అధికారులు జిల్లాకొకరిని పరిశీలకులుగా నియమించారు. ఈక్రమాన ఉమ్మడి ఖమ్మం జిల్లా అబ్జర్వర్‌గా విజయలక్ష్మీబాయిని కేటాయించారు. ఆమె ఉమ్మడి జిల్లాలో పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షిస్తూ యంత్రాంగానికి సూచనలు చేయనున్నారు.
ఖమ్మంసహకారనగర్: పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం మొదలుకానున్నాయి. ఈమేరకు ఈనెల 21నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు జరిగే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లాలో పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్ల వివరాలను డీఈఓ సోమశేఖరశర్మ బుధవారం ‘సాక్షి’కి వెల్లడించారు.
గంట ముందు నుంచే అనుమతి
జిల్లాలో పరీక్షల నిర్వహణకు 97 కేంద్రాలు ఏర్పాటు చేయగా 16,788మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 16,417మంది రెగ్యులర్ విద్యార్థులు, 371మంది ప్రైవేట్(సప్లిమెంటరీ) విద్యార్థులు ఉన్నారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9–30నుంచి మధ్యాహ్నం 12–30గంటల వరకు పరీక్ష కోసం విద్యార్థులను 8–30గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కాగా, 9–35గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించి ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ సూచించారు. కాగా, కేంద్రాల వద్ద తాగునీరు, ఫర్నీచర్, టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యం కల్పించామని తెలిపారు.
ఎవరైనా నడిచి వెళ్లాల్సిందే..
పరీక్ష కేంద్రాల్లో తనిఖీ చేసే బృందాలు గతంలో వాహనాలతో సహా పాఠశాలల ఆవరణలోకి వెళ్లేవారు. కానీ ఈసారి వాహనాలను ఆరుబయటే ఆపి నడిచి వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల రాకపోకలతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సిబ్బంది ఇలా...
జిల్లాలోని పరీక్షా కేంద్రాలను ఏడు రూట్లుగా విభజించగా.. 97మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. మొత్తంగా 1,185మంది ఇన్విజిలేటర్లను నియమించారు. కాగా, 20 పరీక్షా కేంద్రాలను ‘సీ’ సెంటర్లుగా గుర్తించినట్లు డీఈఓ తెలిపారు.
అడిషనల్స్ ఉండవు..
గతంలో జవాబుపత్రంగా ఒక జంట పేపర్ ఇచ్చేవారు. ఆపై విద్యార్థులకు కావాలంటే అదనపు జవాబుపత్రాలు(అడిషనల్స్) ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగేది. కానీ ఈసారి నుంచి 24పేపర్లతో కూడిన బుక్‌లెట్ ఇవ్వనున్నారు. విద్యార్థులు దీనినే సద్వినియోగం చేసుకుని నిర్ణీత ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది.
కంట్రోల్ రూమ్
విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని డీఈఓ సోమశేఖరశర్మ సూచించారు. ఫీజులు చెల్లించలేదని, ఇతర కారణాలతో ఎక్కడైనా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. దీంతో పాటు ఇతర సమస్యలు ఉంటే డీఈఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 83318 51510కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
ప్రియమైన తల్లిదండ్రులారా...
పదో తరగతి పరీక్షలు సమీపించిన నేపథ్యాన జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులకు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ లేఖ రాశారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకునే వాతావరణం కల్పించడం, ఆందోళనకు గురికాకుండా పరీక్షలకు సిద్ధం చేయడం, ఫలితాలపై ఒత్తిడికి గురిచేయకపోవడం, పౌష్టికాహారం అందించాల్సిన ఆవశ్యకతపై ఇందులో సూచనలు చేశారు. ఈమేరకు లేఖ(సాఫ్ట్ కాపీ)ను పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు చేరవేయగా.. వారు ఎస్సెస్సీ విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటుచేసిన వాట్సప్ గ్రూప్‌ల్లో పంపిస్తున్నారు.
కేంద్రాల వద్ద 163 సెక్షన్
ఖమ్మంక్రైం: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమల్లో ఉంటుందని సీపీ సునీల్‌దత్ తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు గుంపుగా ఉండొద్దని, సభలు, సమావేశాలు, మైక్‌లు, డీజేలతో ప్రదర్శనలకు అనుమతి ఉండదన్నారు. పరీక్ష సమయాన కేంద్రాలకు సమీపంలో ఇంటర్‌నెట్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు.