
వాస్తవాలతోనే సమాజ అభ్యున్నతి
● కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ● ‘యువ పార్లమెంట్’కు మూడు జిల్లాల నుంచి 102 మంది హాజరు
ఖమ్మంరాపర్తినగర్: వాస్తవానికే ఎప్పుడూ విలువ ఉంటుందని.. అలా అందరు భావిస్తేనే సమాజ అభ్యున్నతి సాధ్యమవుతుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఈవిషయాన్ని యువతీ, యువకులు పాటించడమే మరికొందరికి అవగాహన కల్పించాలని సూచించారు. ఖమ్మంలోని కేఎండీసీలో బుధవారం వికసిత్ భారత్‌లో భాగంగా ఏర్పాటుచేసిన యువ పార్లమెంట్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. యువత తమ తెలివితేటలను సక్రమమైన మార్గంలో వినియోగించడంలో కొంత మేర వెనకబడుతున్నారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్ర తీసుకొచ్చేందుకు పాటుపడిన మహనీయులు, గొప్పస్థానాల్లో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకోవడమే కాక ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉంటూ సరైన నాయకులను ఎన్నుకుంటే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ కోట అప్పిరెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ మాట్లాడగా ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి ఎన్.శ్రీనివాసరావు, నెహ్రూ యువక కేంద్ర అధికారి కె.భానుచందర్, వికసిత్ భారత్ నోడల్ చైర్మన్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వీ.రమణారావు, పోటీల జ్యూరీ అధికారులు ప్రొఫెసర్ సీతారాం, దినేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘ఒక దేశం..
ఒకే ఎన్నిక’ ఓకే...
దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడ్డారు. యువ పార్లమెంట్‌లో భాగంగా నిర్వహించిన పోటీలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుండి 102మంది యువతీ, యువకులు హాజరయ్యారు. ప్రతీఒక్కరికి మూడేసి నిమిషాల సమయం కేటాయించగా, ఎక్కువ మంది ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ సరైనదేనని తెలిపారు. ఇంకొందరు ఈ విధానంతో సమస్యలు వస్తాయని తెలిపారు.

వాస్తవాలతోనే సమాజ అభ్యున్నతి