ఖమ్మంగాంధీచౌక్: హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును యథావిధిగా కొనసాగించాలని, అలాకాకుండా పేరు మారిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రతినిధులు హెచ్చరించారు. తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశంపై మంగళవారం ఖమ్మంలోని పొట్టిరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్యులు నిరసన తెలిపారు. ఇకనైనా ప్రభుత్వ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు పసుమర్తి సీతారామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు గుమ్మడివెల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు గోళ్ల రాధాకృష్ణమూర్తితో పాటు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, కొత్త వెంకటేశ్వరరావు, చిన్ని కృష్ణారావు, సన్నె ఉదయ్‌ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరరావు, వనమా వేణుగోపాల్‌రావు, మాశెట్టి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.