
కల ఫలించిన వేళ...
● జిల్లాకు 57 మంది జూనియర్ లెక్చరర్లు ● 2022లో నోటిఫికేషన్.. ఇప్పుడు నియామకం ● మరింత బలోపేతం కానున్న ఇంటర్ విద్య
సత్తుపల్లిటౌన్: ఏళ్ల తరబడి సరిపడా అధ్యాపకులు లేక కునారిల్లుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన కష్టాలు ఇకపై తీరనున్నాయి. ఏళ్ల తర్వాత కళాశాలల్లో లెక్చరర్ పోస్టులు భర్తీ చేయడంతో విద్యార్థులకు మెరుగైన బోధన అందుతుందని భావిస్తున్నారు. ఈనెల 12వ తేదీన కొత్త జూనియర్ లెక్చరర్లు నియామక పత్రాలు అందుకుని కళాశాలల్లో రిపోర్ట్ చేయగా, జిల్లాకు 57మందిని కేటాయించారు.
అధ్యాపకులు లేక..
జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో పూర్తిస్థాయిలో సబ్జెక్టు అధ్యాపకులు లేక బోధన సాఫీగా సాగడంలేదు. ఈ కారణంగా విద్యార్థులు నష్టపోతుండగా, ఫలితా లపై ప్రభావం పడుతోంది. గెస్ట్ లెక్చరర్లు, ఒప్పంద అధ్యాపకులను నియమించినా పూర్తిస్థాయిలో ఫలితాలు రావడం లేదు. దీంతో రాష్ట్రప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో లెక్చరర్లను నియమించడం.. జిల్లాలోని కళాశాలలకు 57మందిని కేటా యించడంతో ఇకపై ఇంటర్ విద్య బలోపేతమవుతుందని భావిస్తున్నారు.
చివరగా వైఎస్సార్ హయాంలో...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో జూనియర్ లెక్చరర్ల నియామకానికి 2008లో నోటిఫికేషన్ జారీ అయింది. ఆతర్వాత 14ఏళ్లకు మళ్లీ 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్ వచ్చింది. ఆపై 2023 సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించి, 2024 జూన్‌లోనే ఫలితాలు వెల్లడించినా నియామక ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఇటీవల నియామక పత్రాలు అందించగా అటు అధ్యాపకుల్లో.. ఇటు విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.
ఎదురుచూపులకు తెర
2009లో పీజీ పూర్తి చేసి ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నా. 2022లో జేఎల్ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో ప్రతిభ కనబర్చగా సత్తుపల్లి బాలికల కళాశాలలో జువాలజీ లెక్చరర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. దీంతో ఎదురుచూపులకు తెర పడినట్లయింది. – కె.శ్వేత, తొర్రూరు
ఆనందంగా ఉంది...
ప్రైవేట్ కాలేజీలో సివిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తూ జేఎల్ పోస్టుకు సిద్ధమయ్యాను. నా పీజీ 2011లో పూర్తయింది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదవడంతోఫలితం వచ్చింది. సత్తుపల్లి బాలికల జూనియర్ కళాశాలలో పోస్టింగ్ ఇవ్వగా విధుల్లో చేరా.
– కె.రాణి, వరంగల్

కల ఫలించిన వేళ...

కల ఫలించిన వేళ...