పండితాపురం సంత @ | - | Sakshi
Sakshi News home page

పండితాపురం సంత @

Mar 18 2025 12:40 AM | Updated on Mar 18 2025 12:39 AM

రూ.2,42,30,000
● పోటాపోటీగా వేలం పాడడంతో పెరిగిన ధర ● గత ఏడాదితో పోలిస్తే రూ.36.20లక్షలు అధికం

కామేపల్లి: కామేపల్లి మండలం కొమ్మినేపల్లి(పండితాపురం) గ్రామపంచాయతీ పరిధి శ్రీ కృష్ణప్రసాద్‌ సంతకు వివిధ ప్రాంతాల నుంచి క్రయవిక్రయదారులు వస్తుండడంతో రాష్ట్రంలోనే పేరుంది. ప్రతీ బుధవారం జరిగే ఈ సంతలో ప్రధానంగా పశువులు, మేకలు, గొర్రెల అమ్మకం ఎక్కువగా జరుగుతుంది. దీంతో సంత నిర్వహణను దక్కించుకునేందుకు పలువురు పోటీ పడుతుండగా వేలంలో రికార్డు స్థాయి ధర నమోదవుతోంది. ఇందులో భాగంగా ఈసారి రూ.2,42,30,000 పలకగా కొత్త రికార్డు నెలకొంది.

గత నెల 13న నిర్వహించినా...

2025–26 ఆర్థిక సంవత్సరానికి బాధ్యతలు అప్పగించేందుకు ఈనెల 13న గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారి రవీందర్‌ అధ్యక్షతన బహిరంగ వేలం నిర్వహించారు. అయితే, నలుగురు పాల్గొనగా బోడా శ్రీను రూ.2,35,70,000 అత్యధికంగా పాడినా ప్రభుత్వ మద్దతు ధర రాలేదని అధికారులు రద్దు చేశారు. తిరిగి సోమవారం డీఎల్‌పీఓ రాంబాబు సమక్షంలో జీపీ ప్రత్యేకాధికారి, ఎంపీడీఓ రవీందర్‌ అధ్యక్షతన వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన భూక్యా వీరన్న, బానోత్‌ లక్ష్మణ్‌, బోడా శ్రీను పాల్గొన్నారు. గత వేలం పాటలో హెచ్చుగా నమోదైన రూ.2,35,70,000 నుంచి ప్రారంభించగా భూక్యా వీరన్న, బానోతు లక్ష్మణ్‌ మధ్య హోరాహోరీగా వేలం సాగింది. చివరకు భూక్యా వీరన్న రూ.2,42,30,000కు హెచ్చు పాటదారుడిగా నిలిచాడు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,42,01,540 కంటే ఎక్కువకు పాడడంతో వీరన్ననే ఖరారు చేశారు. ఈమేరకు ఆయన సాల్వేన్సీ రూ.5లక్షలతో పాటు పాట మొత్తంలో మూడో వంతైన రూ.80.77లక్షలు అక్కడికక్కడే చెల్లించాడు. కాగా, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.36.20లక్షలు అధికంగా జీపీకి ఆదాయం లభించింది. వేలం దృష్ట్యా ఆవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై సాయికుమార్‌ పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రభాకర్‌రెడ్డి, జీ.వీ.సత్యనారాయణ, కార్యదర్శి శంకర్‌, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ..

పండితాపురం సంత ఏర్పడి సుమారు 30 ఏళ్లవుతోంది. తొలినాళ్లలో రూ.వందల్లోనే పలికే పాట ఇప్పుడు రూ.కోట్లకు చేరింది. గ్రామంలో వర్గపోరు కారణంగా ఆధిపత్యం సాధించాలంటే సంత తమ ఆధీనంలో ఉండాలని పోటీ పడుతుండడం ఆనవాయితీగా మారింది. గిరిజనులు మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశమున్న ఈ సంతకు గ్రామస్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలోనూ మంచి గుర్తింపు ఉన్న కారణంగా వేలంలో రికార్డు దర నమోదవుతుండగా, అదేస్థాయలో గ్రామపంచాయతీకి నిధులు జమ అవుతున్నాయి. ఈ నిధులతో గ్రామంలో అనేక అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కాగా, కరోనా వ్యాప్తి సమయాన కొద్దివారాలు మాత్రమే సంత నిలిచిపోయింది.

ఆర్థిక సంవత్సరం ఆదాయం

2019–20 రూ.2,05,30,000

2020–21 రూ.91,70,000 (కరోనా)

2021–22 రూ.1,99,30,000

2023–24 రూ.2,39,50,000

2024–25 రూ.2,06,10,000

2025–26 రూ.2,42,30,000

పండితాపురం సంత @1
1/1

పండితాపురం సంత @

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement