ఖమ్మంవైద్యవిభాగం: రోజురోజుకూ ఎండలు పెరుగుతున్న నేపథ్యాన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బి.కళావతిబాయి సూచించారు. జిల్లాలో పగటిపూట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతున్న నేపథ్యాన ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈమేరకు ఎండ నుండి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బ బారిన పడిన వారికి చికిత్స కోసం వైద్య, ఆరోగ్య శాఖ చేపడుతున్న చర్యలను ఆమె ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ వెల్లడించిన అంశాలు ఆమె మాటల్లోనే...
ఎండల వేళ అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందే
● వడదెబ్బ బాధితుల చికిత్సకు ఆస్పత్రుల్లో ఏర్పాట్లు ● అత్యవసర సమాచారానికి కంట్రోల్ రూం కూడా.. ● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కళావతిబాయి
పగలు ఎండ.. రాత్రి చలి
ఇటీవల వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. పగటిపూట ఎండ, అర్ధరాత్రి నుండి ఉదయం వరకు చలితీవ్రత ఉంటోంది. ఇలాంటి పరిస్థితితో వివిధ రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. జ్వరం, జలుబు, దగ్గు, అస్తమా వంటి వ్యాధులతో పాటు ఎండతీవ్రత కారణంగా వడదెబ్బకు గురయ్యే అవకాశముంది. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎండ తీవ్రత నేపథ్యాన ఉదయం 11నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్ల నుండి బయటకు రాకపోవడమే మంచిది. తప్పనిసరై వస్తే తలకు టోపీ, ఖద్దర్ వస్త్రాలు, గొడుగు, చలువ కళ్లద్దాలు ధరించాలి.
మా తరఫున సిద్ధం
వేసవి దృష్ట్యా గత నెలలోనే టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించాం. జిల్లాలోని అన్ని మండలాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేశాం. 24 పీహెచ్‌సీలు, నాలుగు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు లక్ష ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు చేరవేశాం. అవసరమైతే మరిన్ని ప్యాకెట్లు పంపిస్తాం. జిల్లా కేంద్రంలో 97041 50025 టోల్‌ఫ్రీ నంబర్‌తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. ఎండ వేడితో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. అలాగే ఎవరికై నా కళ్లు తిరగటం, వాంతి వచ్చినట్లు అనిపించటం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలి. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేయగా.. వివిధ శాఖల సమస్వయంతో అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేకున్నా... ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మరవొద్దు.
ఆహారమూ ముఖ్యమే..
ఈ వేసవిలో ఎప్పటికప్పుడు వండిన ఆహారాన్నే తీసుకోవాలి. నిమ్మరసం, ఓఆర్‌ఎస్, వివిధ రకాల పండ్ల రసాలు, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవడం మంచిది. అలాగే, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. జంక్‌ఫుడ్స్ సైతం తీసుకోవద్దు. ఎండవేడితో శరీరం డీహైడ్రేషన్ కాకుండా ప్రతీ గంటకు ఒక గ్లాస్ నీరు తీసుకోవాలి.
తస్మాత్ జాగ్రత్త
తస్మాత్ జాగ్రత్త