కొత్తగూడెంటౌన్: మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాక్షి దినపత్రిక ఉద్యోగి సోమవారం మృతి చెందాడు. కొత్తగూడెం న్యూ గొల్లగూడేనికి చెందిన తాటిపల్లి రాజేష్‌కుమార్(38) సాక్షి దినపత్రికలో సీనియర్ యాడ్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 14న మధ్యాహ్నం బైక్‌పై రామవరంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కొత్తగూడెం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రాజేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అదే కారులో క్షతగాత్రుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత వరంగల్ ఎంజీఎంకు, అనంతరం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య నాగలక్ష్మి, ఏడేళ్లలోపు కూతుళ్లు ఇద్దరు ఉన్నారు. ఈ విషయమై కొత్తగూడెం వన్‌టౌన్ సీఐ ఎం.కరుణాకర్‌ను వివరణ కోరగా.. బైక్‌ను కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. కారు రుద్రంపూర్ తిలక్‌నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
లారీడ్రైవర్ ఆత్మహత్య
కొణిజర్ల: ఓ వైపు అప్పుల బాధ, మరోవైపు పెళ్లయిన కొద్దిరోజులకే కూతురి భర్త మృతిని జీర్ణించుకోలేక మద్యానికి బానిసైన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనికెళ్ల గంగెడ్లపాడుకు చెందిన లారీడ్రైవర్ తాళ్ల ఆనందరావు(51)కు భార్య శౌరమ్మతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు వివాహం చేయగా ఈ ఏడాది జనవరిలో అల్లుడు మృతి చెందాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసైన ఆనందరావు సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరివేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సూరజ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో సాక్షి ఉద్యోగి మృతి