ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన
● పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాలోని ఏడు పాఠశాలల్లో అమలు.. ● ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్ ● ఇటీవల రాష్ట్రస్థాయిలో జిల్లా విద్యార్థికి అభినందనలు
ఖమ్మం సహకారనగర్: ప్రస్తుత కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ – కృత్రిమ మేధ)కి ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ క్రమాన విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే ఈ విధానంలో బోధన చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఏడు పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధనను గత నెల 24 నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. విద్యార్థులకు కొనసాగుతున్న ఈ బోధనపై ఈనెల 11న హైదరాబాద్‌లో అధికారులకు శిక్షణ ఏర్పాటుచేయగా... జిల్లా విద్యార్థి అనర్గళంగా మాట్లాడడంతో అభినందనలు దక్కాయి. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్.. ఏఐ బోధనపైనా శ్రద్ధ చూపుతుండడంతో సత్ఫలితాలు రావడం మొదలైందని చెబుతున్నారు.
70 మంది విద్యార్థులకు..
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగానికి కూడా ఉపయోగించుకుని విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఏఐని ఉపయోగిస్తోంది. జిల్లాలో ఏఐ బోధనకు ఏడు పాఠశాలలు ఎంపిక కాగా.. ఇందులో ఎఫ్‌ఎల్‌ఎన్(ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ)లో కొంత బలహీనంగా ఉన్న విద్యార్థులను ఎంపిక చేశారు. పాఠశాలకు 10మంది చొప్పున మొత్తం 70 మందికి ఏఐ ద్వారా బోధిస్తున్నారు. దీని ద్వారా వారు ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకునే వీలుంటుంది. ఆపై ఇతర విద్యార్థులతో సమానంగా సబ్జెక్ట్‌పై పట్టు సాధించనున్నారు.
వారానికి 40 నిమిషాలు..
విద్యార్థులకు వారానికి 40 నిముషాల చొప్పున ఈ ఏఐ విధానంలో బోధన సాగిస్తున్నారు. ఇవి 20 నిమిషాల చొప్పున రెండు సెషన్‌లు ఉంటాయి. 20 నిమిషాలు తెలుగు, 20 నిమిషాలు మ్యాథ్స్ ప్రస్తుతం బోధిస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన సబ్జెక్ట్‌లు కూడా బోధించనున్నారు. విద్యార్థులు తమకు అర్థమయ్యే వరకు ఈ సబ్జెక్ట్‌లను నేర్చుకునేందుకు ఏఐ విధానంలో అవకాశం ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడడంతో పాటు గణితంపై పట్టు సాధించేందుకు ఏఐ దోహదపడుతుంది. ఇక్కడ జరుగుతున్న బోధన అనుకూల ఫలితాలిస్తే మిగిలిన పాఠశాలల్లోనూ ప్రవేశపెట్టనున్నారు.
త్వరలోనే కంప్యూటర్లు, సామగ్రి
జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా సత్తుపల్లి మండలంలోని సిద్ధారం ఎంపీయూపీఎస్, సత్తుపల్లిలోని ఎన్టీఆర్ నగర్ ఎంపీపీఎస్, ఖమ్మంలోని ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాల, రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాల, పాండురంగాపురం ఎంపీపీఎస్, మల్లెమడుగు ఎంపీపీఎస్‌తో పాటు నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెం స్కూల్‌లో ఏఐ ఆధారిత బోధన మొదలైంది. ఈ పాఠశాలలకు రెండు, మూడు రోజుల్లో అదనంగా కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర సామగ్రి అందించనున్నట్లు జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి కె.రవికుమార్ తెలిపారు. ఈనెల 20లోగా ఇవి పాఠశాలలకు చేరనుండడంతో బోధన ఊపందుకుంటుందని భావిస్తున్నారు.
సత్తా చాటిన జిల్లా విద్యార్థి..
ఏఐ బోధన సాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు నేర్చుకున్న విధానంపై మంచి స్పందన వచ్చింది. దీంతో ఇతర జిల్లాల అధికారులకు కూడా ఈనెల 11న హైదరాబాద్‌లో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లాలోని నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెంలోని ఎంపీపీఎస్‌లో 4వ తరగతి చదువుతున్న పవన్‌సాయి పాల్గొన్నాడు. సాయిని స్టేజీపైకి పిలవగా.. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ (ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్ జి.రమేష్.. ఇన్నాళ్లూ ఏం నేర్చుకున్నావని ఆరా తీశారు. దీంతో విద్యార్థి నేర్చుకున్న అంశాలను స్పష్టంగా చెప్పడంతో అభినందనలు దక్కాయి. కాగా, జిల్లా నుంచి డీఈఓ సోమశేఖరశర్మ, ఏఎంఓ రవికుమార్‌తో పాటు మరో ముగ్గురు కూడా పాల్గొన్నారు.
విద్యార్థుల్లో ‘మేధ’స్సు పెంచేలా...