పొలాల్లోకి దూసుకెళ్లిన కారు | - | Sakshi
Sakshi News home page

పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

Mar 16 2025 12:24 AM | Updated on Mar 16 2025 12:23 AM

నేలకొండపల్లి: రహదారిపై స్కూటీని తప్పించే క్రమాన స్తంభాన్ని ఢీకొట్టిన కారు పొలాలకు దూసుకెళ్లింది. మండలంలోని అజయ్‌తండాకు చెందిన తేజావత్‌ ప్రసాద్‌, తేజావత్‌ రూప్లా, గోవిందరావుతో పాటు సూర్యాపేటకు చెందిన లింగా కారులో శనివారం చెరువుమాధారం నుంచి ఆజయ్‌తండాకు వెళ్తున్నారు. ఈక్రమంలో గ్రామంలోని పాఠశాల సమీపాన ఎదురుగా వచ్చిన స్కూటీని తప్పించబోయి కారు స్తంభాన్ని ఢీకొట్టి పక్కనే పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న వారు గాయపడగా.. స్థానికులు బయటకు తీసి ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. కాగా, ప్రమాదంలో స్తంభం విరిగిపోగా ఆ సమయాన విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది.

ఇసుక టిప్పర్‌ సీజ్‌..

పెనుబల్లి: ఏపీ ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్‌ను వీఎం బంజర్‌ పోలీసులు శనివారం తెల్ల వారుజామున సీజ్‌ చేశారు. ఎలాంటి పన్ను చెల్లించకుండా తెలంగాణ ఆదాయానికి గండి కొట్టేలా పలువురు ఏపీ నుంచి ఇసుక తీసుకొచ్చి పెనుబల్లి, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని లారీ అసోసియేషన్‌ బాధ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై కె.వెంకటేష్‌ తనిఖీలు చేపట్టగా టిప్పర్‌ పట్టుబడింది. భద్రాచలం నుంచి తీసుకొస్తున్న ఇసుక టన్ను రూ.1,300 నుంచి రూ.1,400కు విక్రయిస్తుండగా(పన్నుతో కలిపి), ఏపీ నుంచి తీసుకొచ్చే ఇసుక టన్ను రూ.900 నుంచి రూ.వెయ్యి వరకే విక్రయిస్తూ ఎలాంటి పన్ను చెల్లించడం లేదని గుర్తించారు. ఈమేరకు లారీ యజమాని, డ్రైవర్‌, ఏజెంట్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

వివాహిత ఆత్మహత్య..

బోనకల్‌: ఓ వివాహిత ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మండలంలోని ఆళ్లపాడుకు చెందిన షేక్‌ మస్తాన్‌ – జరీనా(28)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. అత్త మైబూబీతో కలిసి శనివారం మధ్యాహ్నం ఇంటి ఎదుట ఉన్న జరీనా, కాసేపు విశ్రాంతి తీసుకుంటానని ఇంట్లోకి వెళ్లింది. ఆమె ఇద్దరు కుమారులు మధ్యాహ్నం స్కూల్‌ నుంచి వచ్చాక ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల తలుపులు పగులగొట్టారు. అప్పటికే ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఆటోడ్రైవర్‌గా కిరాయికి వెళ్లిన మస్తాన్‌ స్థానికంగా లేకపోవడంతో ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం

అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి

చింతకాని: మండలంలోని నర్సింహాపురం సమీపాన గ్యాస్‌ గోదాం వద్ద ఆటోను గుర్తుతెలియని ఓ వాహనం ఢీకొట్టిన ఘటనలో రఘునాథపాలెంకు చెందిన గాజుల అనిల్‌కుమార్‌(35) మృతి చెందాడు. శనివారం జరిగిన ఈ ప్రమాదం వివరాలు... సొంత ఆటో ఉన్న అనిల్‌కుమార్‌ ఖమ్మంలోని ఓ దినపత్రిక ప్రెస్‌ నుంచి పేపర్‌ పార్సిళ్లను తీసుకొచ్చి గ్రామాల్లో వేస్తుంటాడు. ఇలాగే శనివారం తెల్లవారుజామున ఖమ్మం నుంచి అల్లీపురం, చింతకాని మండలం కొదుమూరు, లచ్చగూడెం మీదుగా ఆటోలో చింతకానికి వస్తుండగా నర్సింహాపురం సమీపాన ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన అనిల్‌ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో సైతం నుజ్జునుజ్జయింది. ఆయనకు భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమేరకు మృతదేహాన్ని అన్నం సేవా ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నామని ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.

లారీ ఢీకొని వ్యక్తి..

ఖమ్మంరూరల్‌: మండలంలోని కరుణగిరి వద్ద ట్రాలీ ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌ బీతపూడి నరేంద్ర(46) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దానవాయిగూడెంకు చెందిన నరేంద్ర రాజీవ్‌గృహకల్పలో వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్నారు. శనివారం ఆయన ప్లాంట్‌ నుంచి ట్రాలీ ఆటోలో వాటర్‌ క్యాన్లు తీసుకుని దానవాయిగూడెం వెళ్తూ ప్రధాన రహదారిపైకి వస్తుండగా ఖమ్మం నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నరేంద్రను ఖమ్మం ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆయన భార్య రాజేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
1
1/1

పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement