
ప్రశ్నిద్దాం.. అది మన హక్కు
● వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం ● 1986లో ఏర్పాటు.. 2019లో మరింత బలోపేతం ● ఇప్పటివరకు జిల్లాలో 10,206 కేసులు.. 10,055 పరిష్కారం
నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం
ఖమ్మంలీగల్: కొనుగోళ్లు, సేవల కోసం డబ్బు చెల్లించే ప్రతీఒక్కరు వినియోగదారులుగానే పరిగణనలోకి వస్తారు. ఈసమయాన నాణ్యతను ప్రశ్నించడం, రశీదు తీసుకోవడం, ధరల తెలుసుకోవడం హక్కుగా సంక్రమిస్తాయి. అదేసమయాన చౌకబారు, నాణ్యత లేని వస్తువులు వచ్చినట్లు తెలిస్తే ప్రశ్నించడం కూడా వినియోగదారుల హక్కుగానే భావించాలి. నేడు(శనివారం) వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా హక్కుల రక్షణకు ఉన్నచట్టం, ఫిర్యాదు చేయాల్సిన తీరు, ఇటీవల వెలువడిన తీర్పులపై కథనం
న్యాయం.. నష్టపరిహారం
వినియోగదారుల రక్షణ చట్టం –1986 ద్వారా ఫిర్యాదు వినడంతో పాటు న్యాయం చేయడమే కాక నష్ట పరిహారం ఇప్పించడానికి ఒక వ్యవస్థ ఏర్పడింది. ఈ చట్టం 1986లో వచ్చింది. అంతకుముందు వినియోగదారులు 40 రకాల చట్టాలపై ఆధారపడాల్సి వచ్చేది. దీంతో ఇంగ్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని చట్టాలను అధ్యయనం చేశాక ప్రత్యేక తీసుకొచ్చారు. ఆ తర్వాత 2019లో మరింత బలోపేతం చేస్తూ కొత్త చట్టం ఏర్పరిచారు. అంతర్జాల వేదికలు, ఈ–కామర్స్ ద్వారా కూడా రక్షణ లభించేలా ఇందులో నిబంధనలు పొందుపరిచారు. చట్టం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 10,206 కేసులు నమోదు కాగా.. వీటిలో 10,055 పరిష్కారమయ్యాయి.
చట్టం లక్ష్యాలు
దోపిడీకి గురైన, మోసపోయిన, దొంగ వ్యాపారంతో విసిగిపోయిన వినియోగదారులకు రక్షణ కవచంలా ఈ చట్టం ఉపయోగపడుతుంది. కష్టాలు, నష్టాలు, కడగండ్ల నుంచి తప్పించడానికి సాయపడుతోంది. సాధారణ, తక్కువ ఖర్చు, కాలయాపన లేకుండా న్యాయం చేకూర్చడమే ఈ చట్టం ఉద్దేశం.
ఫిర్యాదులు
జిల్లా పరిధిలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఏర్పాటైంది. ఎవరైనా వ్యక్తిగా, సామూహికంగా ఫిర్యాదు చేయొచ్చు. అలాగే, కేంద్ర, రాష్ట్ర, జిల్లాస్థాయిలో మూడంచెలుగా న్యాయవ్యవస్థ, జాతీయ కమిషన్, రాష్ట్ర వినియోగదారుల వివాదాల నివారణ కమిషన్, జిల్లా స్థాయిలో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఏర్పాటైంది. కొన్న వస్తువులు పాడైనా, నాసిరకంవి వచ్చినా, ఆశించిన రీతిలో లేకున్నా, లోపాలు ఉన్నా, అధికధర వసూలు చేసినా రాతపూర్వకంగా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చు.
జరిమానా.. శిక్షలు
ఎవరికి వ్యతిరేకంగానైతే ఉత్తర్వులు జారీ అవుతాయో, వాళ్లు ఆ ఉత్తర్వులను అమలుపర్చకపోతే వారికి శిక్ష విధించే అధికారం ఫోరమ్‌లు, కమిషన్లకు ఉంటుంది. వ్యక్తికి నెల తగ్గకుండా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.2వేలు తగ్గకుండా రూ.10వేల వరకు జరిమానా లేదా ఈ రెండింటినీ విధించవచ్చు. అయితే, వీటిపై అప్పీల్‌కు వెళ్లొచ్చు.
ఫిర్యాదు చేయడం ఇలా...
వస్తువు ధర ఆధారంగా రూ.50లక్షల నష్టపరిహారం వరకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేసే అవకాశముంది. ఇక రూ.50లక్షలకు పైన రాష్ట్ర వినియోగదారుల ఫోరం, ఆపైన జాతీయ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాలి. కోర్టు రుసుముతో పాటు ఫిర్యాదు ఆధారంగా ఫీజు చెల్లించి పూర్తి వివరాలు సమర్పించాలి. వినియోగదారుల తరఫున న్యాయవాది లేదా సొంతంగానూ వాదనలు వినిపించవచ్చు. అయితే, వివాదం తలెత్తిన రెండేళ్ల లోపు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. e.jagrithi.gov. in ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించారు. ఇతర వివరాల కోసం 08742– 254347 నంబర్‌లో సంప్రదించవచ్చు.
ధంసలాపురానికి చెందని తుమ్మ అప్పిరెడ్డి భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్లేందుకు హైదరాబాద్‌లోని అర్చన ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టూర్ ఆపరేటేర్ బద్దం బోజిరెడ్డి ద్వారా 2023 ఏప్రిల్‌లో రూ.71వేలు చెల్లించి ప్యాకేజీ తీసుకొన్నారు. ఆపై రకరకాల కారణాలతో వాయిదా వేస్తుండగా, అప్పిరెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కారం కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ చేసిన అనంతరం టూర్ కోసం చెల్లించిన రూ.71వేలు, కేసు నమోదు చేసిన నాటి నుంచి ఏడు శాతం వడ్డీతో కలిపి చెల్ల్లిండచమే కాక ఇబ్బందికి వేదనకు రూ.10వేలు, లిటిగేషన్ ఖర్చులకు రూ.10వేలు కూడా చెల్లించాలని తీర్పునిచ్చింది.
తల్లాడ మండలం మల్లవరానికి చెందిన దుగ్గిదేవర వెంకటలాల్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. కోవిడ్ బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్సకు రూ.54,963 బిల్లు చెల్లించాడు. ఈ బిల్లు ఇవ్వాలని బీమా కంపెనీని సంప్రదిస్తే నిరాకరించారు. దీంతో సేవాలోపం కింద ఆయన జిల్లా వినియోగదారుల కమిషన్‌లో 2022 జనవరి 28న ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఇరుపక్షాల వాదనలు విన్న సేవా లోపం జరిగిందని నిర్ధారించారు. దీంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ(వనస్థలిపురం) తరఫున ఫిర్యాదికి రూ.73,707 చెల్లించాలని తీర్పు చెప్పారు.

ప్రశ్నిద్దాం.. అది మన హక్కు

ప్రశ్నిద్దాం.. అది మన హక్కు

ప్రశ్నిద్దాం.. అది మన హక్కు