పట్టుబట్టి
కొలువు కొట్టి..
మధిర: మండలంలోని దేశనేనిపాలెంకు చెందిన మందలపు సుధాకర్ గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 74వ ర్యాంకుతో సత్తా చాటాడు. రైతు కుటుంబానికి చెందిన ఆయన ఇప్పటికే గ్రూప్–4 ద్వారా ఉద్యోగం సాధించి ఖమ్మం కార్పొరేషన్లో వార్డు ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు గ్రూప్–2 లోనూ ప్రతిభచాటిన సుధాకర్ ఇంటర్మీడియట్ మధిర శ్రీనిధి జూనియర్ కళాశాలలో, బీటెక్ హైదరాబాదులో పూర్తి చేశాడు. తల్లిదండ్రుల సహకారంతో కష్టపడి చదివిన తాను, ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే జీవితానికి భరోసా అని నమ్మానని తెలిపాడు.
కారేపల్లి: ఇటీవల విడుదలైన గ్రూప్–1, 2 ఫలితాల్లో కారేపల్లి మండలం సూర్యతండా గ్రామానికి చెందిన బాధావత్ భువనేశ్వర్ ప్రతిభ చాటాడు. గ్రూప్–1లో 432 మార్కులు సాధించగా, గ్రూప్–2లో 376 మార్కులతో రాష్ట్రస్థాయి 322, జోనల్ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. కాగా, ఇప్పటికే గ్రూప్–4లో ప్రతిభ చాటిన ఆయన జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తూనే ఇప్పుడు గ్రూప్–1, 2కు ఎంపికవడంపై పలువురు అభినందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన బాదావత్ లక్ష్మణ్–సరోజ కుమారుడైన భువనేశ్వర్ తల్లి ఆయన చిన్నతనంలోనే మృతి చెందింది. దీంతో మేనమామ, 2017లో గ్రూప్–1కు ఎంపికై జిల్లా ఆడిట్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న బానోతు రాము ప్రోత్సాహంతో చదివి ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యాడు.
గ్రూప్–1, 2 ఫలితాల్లో సూర్యతండా వాసి ప్రతిభ