● విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షలు రాయాలి ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మంఅర్బన్: చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని, విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షలు బాగా రాయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. నగరంలోని పాండురంగాపురం పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, వసతి, విద్యాబోధనను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష ఫలితాలు విద్యార్థుల భవిష్యత్‌కు తొలిమెట్టని అన్నారు. పలు అంశాలపై విద్యాబోధన చేశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. వారితో మమేకమై ఎలా చదువుతున్నారు? టీచర్లు పాఠాలు ఎలా చెబుతున్నారు అని ఆరా తీశారు. ప్రతి విద్యార్థికి గొప్ప లక్ష్యం ఉండాలని, దాన్ని సాధించేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సౌకర్యాలు ఉన్నాయని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అన్ని రకాల పుస్తకాలు, సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లాలో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట డీఈఓ సోమశేఖరశర్మ తదితరులు ఉన్నారు.