మిల్లెట్స్‌.. వరిలో మేలిమి రకాలు | - | Sakshi
Sakshi News home page

మిల్లెట్స్‌.. వరిలో మేలిమి రకాలు

Feb 9 2025 12:24 AM | Updated on Feb 9 2025 12:24 AM

మిల్ల

మిల్లెట్స్‌.. వరిలో మేలిమి రకాలు

మధిర: మధిర మండలం నిధానపురానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు వట్టివేళ్ల సురేందర్‌రెడ్డి మిల్లెట్స్‌(చిరుధాన్యాలు)తోనే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని ఆచరించి చూపిస్తున్నారు. ఆయనకు 2020 సంవత్సరంలో అనారోగ్య సమస్య ఎదురైంది. కేన్సర్‌ అనే అనుమానాలు వ్యక్తమైనా పరీక్షల్లో నిర్ధారణ కాలేదు. అయితే, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడిన ఆహార ఉత్పత్తులను తినడంతో కేన్సర్‌ ముప్పు ఉంటుందని తెలియడంతో కొంతమేర సొంత అవగాహన.. ఇంకొంత గూగుల్‌, యూట్యూబ్‌ ద్వారా తెలుసుకోవడమే కాక ఎక్కడ ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగుపై శిక్షణ ఉన్నా హాజరయ్యేవారు. ఆ తర్వాత ఐదేళ్ల నుంచి నాలుగెకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రెండు ఎకరాల్లో మిల్లెట్స్‌ అయిన కొర్రలు, అండు కొర్రలు, సామలు, రాగులు, నల్ల పెసర, మినుము సాగు మొదలుపెట్టారు. అంతేకాక సొంతంగా గోకృపామృతం తయారు చేస్తూ దేశీయ ఆవులను పోషిస్తున్నారు. వరిలో నవారా, మైసూర్‌ మల్లిక, కుంకుమశాలి, కాలాబట్టి, రత్నచోడి వంటి దేశీయ రకాలు సాగు చేస్తూ ఆ బియ్యాన్నే సొంత అవసరాలకు ఉపయోగిస్తున్నారు. కాగా, 200 లీటర్ల డ్రమ్ములో 180 లీటర్ల నీరు పోసి రెండు కేజీల దేశీయ బెల్లం, రెండు లీటర్ల మజ్జిగతో పాటు అంతకు ముందే ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త గోపాల్‌ బాయి సుపారియా సూచనలతో చేసిన రెండు లీటర్ల గోకృపామృతం కలుపుతారు. రోజుకు మూడుసార్లు కలియతిప్పుతుండగా నాలుగైదు రోజుల్లో గోకృపామృతం తయారవుతుంది. దీంతో పాటు దేశీయ ఆవు మూత్రం, దేశీయ ఆవు మజ్జిగ, వేపగింజల కషాయంతో తెగుళ్ల నివారణ సాధ్యమవుతోందని సురేందర్‌రెడ్డి తెలిపారు. ప్రకృతి సిద్ధంగా పండిన ఆహారాన్ని తీసుకోవడం వల్లే ఆరోగ్యంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. చిరుధాన్యాల సాగుకు ఎలాంటి మందుల పిచికారీ అవసరముండదని చెప్పారు. దేశీయ ఆవులు పెంచుతూ వాటి పాలు, పెరుగు, నెయ్యి తయారు చేసి వాడుతుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.

మిల్లెట్స్‌.. వరిలో మేలిమి రకాలు
1
1/1

మిల్లెట్స్‌.. వరిలో మేలిమి రకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement