
రామాలయంలో విశ్వరూప దృశ్యం
ఈనెల 13 నుంచి ముక్కోటి అవతారాలు
● 22న తెప్పోత్సవం, 23న ఉత్తర ద్వార దర్శనం ● జనవరి 08 న స్వామి వారికి విశ్వరూప సేవ ● తిలకించి పులకించనున్న భక్తజనం
భద్రాచలం : భూలోక వైకుంఠం భద్రగిరి ముక్కోటి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో జగదభిరాముడికి జరిగే వేడుకల్లో ఇది ప్రత్యేకమైనది. 13 నుంచి జనవరి 02 వరకు అధ్యయనోత్సవాలు, 3 నుంచి నుంచి 5 వరకు విలాసోత్సవాలు, 8న స్వామివారికి విశ్వరూప సేవ జరపనున్నారు. దేవతలందరినీ ఒకే చోట కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేస్తారు. విశ్వరూప సేవ కేవలం భద్రాచలంలో రామయ్యకు మాత్రమే జరిగే ప్రత్యేక వేడుక కావడం విశేషం. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈనెల 13 నుంచి 22 వరకు పగల్ పత్తు ఉత్సవాలు, 23 నుంచి జనవరి 2 వరకు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. పగల్‌పత్తు ఉత్సవాల్లో స్వామివారు తొమ్మిది అవతారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత
సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన సమయం దేవతులకు బ్రహ్మముహూర్త కాలం. ఈ పరమ పవిత్రమైన కాలంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును వైకుంఠంలోని ఉత్తరద్వారం నుంచి ఈ ఏకాదశి రోజే దర్శిస్తారని, అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని మరోపేరు ఉందని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినోత్సవాన్ని మధ్యపణిపూసగా చేసుకొని ముందు పదిరోజులు పగల్ పత్తు, వెనుక పదిరోజులను రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు.
మత్స్యావతారం (ఈనెల 13న)
శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో మెదటిది మత్స్యావతారం. దీనికి సంబంధించి రెండు పురాణ గాధలు ఉన్నాయి. జ్ఞాననిధులైన బ్రహ్మ నుంచి అపహరించి సముద్రంలో దాగి ఉన్న సోమకాసురిని సంహరించడానికి మత్స్యావతారం ధరించి వేదాలను ఉద్ధరించాడు. రెండోది నావలో ఉన్న వైవస్వత మనువును, సప్తరుషులను, సృష్టికి అవసరమైన విత్తనాలను, ఔషధాలను జలప్రళయం నుంచి రక్షించాడు. ఈ అవతారాన్ని పూజిస్తే కేతు గ్రహ బాధలు తొలగుతాయని ప్రతీతి.
స్వామివారి అవతారాలిలా..

గోదావరిలో తెప్పోత్సవం (ఫైల్)

వైకుంఠ ద్వార దర్శన పూజల్లో భక్త జనం
