పాల్వంచ: కిన్నెరసాని గిరిజన గురుకుల (ప్రతిభ జూనియర్) కళాశాలలో ఆదివారం ఇంటర్మీడియట్ విద్యార్థులను కొందరు తల్లిదండ్రులు చితకబాదారు. స్థానికులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొందరు విద్యార్థులు రహస్యంగా మద్యం సేవిస్తుండడం పరిపాటిగా మారడంతో తోటి విద్యార్థులు గమనించి ప్రశ్నించడంతో మద్యం సేవించే విద్యార్థులు వారితో గొడవ పడ్డారు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడంతో వారు కళాశాలకు చేరుకుని విద్యార్థులను ఓ గదిలో తీసుకెళ్లి చితకబాదారు. దీంతో సమాచారం అందుకున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అక్కడకు చేరుకుని మాట్లాడుతూ.. గతంలో ఇటువంటి ఘటనలు తమ దృష్టికి ఎన్నడూ రాలేదని, ఉంటే తక్షణం చర్యలు తీసుకుంటామని, గొడవ చేయొద్దని చెప్పారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ రవికుమార్‌ను వివరణ కోరగా.. గొడవకు కారమైన, ఆరోపణలు వచ్చిన విద్యార్థులను సస్పెండ్ చేస్తామన్నారు. ఈమధ్య కాలంలో మాదక ద్రవ్యాలు రహస్యంగా తీసుకుంటున్నట్లు తమ దృష్టికి రావడంతో ఉన్నతాధికారులకు తెలియజేశామని తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ప్రిన్సిపాల్ వివరించారు.
మాదకద్రవ్యాల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ