
మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం నగరంలోని అమరవీరులస్తూపం వద్ద పశుసంవర్థక శాఖ వైద్యులు అనంతు హరీశ్ జేబులోని రూ.24,500 నగదు చోరీకి గురైంది. బాధితుడి కథనం మేరకు.. ఆదివారం నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన, జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం నగరంలోని అమరవీరులస్తూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ తరఫున తాను పాల్గొన్నానని, ఈ క్రమంలో జేబులోని నగదు చోరీకి గురైందని హరీశ్ తెలిపారు. సోమవారం ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
ప్రజా తీర్పును గౌరవిస్తాం..
ఖమ్మంరూరల్: ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం మండలంలోని వరంగల్ క్రాస్‌రోడ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టులకు గెలుపోటములు సహజమేనని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్‌లో కూడా వర్గపోరాటాలు నిర్వహిస్తామని, పోరాటాల ద్వారా నే పార్టీ బలం పెరుగుతుందన్నారు. రానున్న కాలంలో ప్రజా సమస్యలపై తిరుగులేని పోరాటం చేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం నాయకులు బి.రమేశ్, నండ్ర ప్రసాద్, వి.సుదర్శన్‌రెడ్డి, పెదవెంకటరెడ్డి, వెంకట్రా వు, పి.వెంకటేశ్వర్లు, ఏటుకూరి వరప్రసాద్, కె.గురవయ్య, కరుణాకర్, రామయ్య పాల్గొన్నారు.
ఏపీలో భద్రాచలం వాసి మృతి
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భద్రాచలం వాసి మృతి చెందాడు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. భద్రాచలం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన అవివాహితుడు ఉజ్జగిరి క్రాంతికుమార్ (31) కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. కాగా, వ్యక్తిగత పనులపై భద్రాచలం నుంచి జంగారెడ్డిగూడెం వైపు తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని లారీ వేగంగా వచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో క్రాంతికుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.