సాఫ్ట్‌వేర్‌ కోచింగ్‌ పేరుతో ఘరానా మోసం | - | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ కోచింగ్‌ పేరుతో ఘరానా మోసం

Dec 11 2023 12:46 AM | Updated on Dec 11 2023 12:46 AM

వైరాలో సాఫ్ట్‌వేర్‌ కోచింగ్‌ సెంటర్‌  - Sakshi

వైరాలో సాఫ్ట్‌వేర్‌ కోచింగ్‌ సెంటర్‌

● మాయమాటలు చెప్పి మహిళ నుంచి రూ.6 లక్షలు వసూలు ● ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

వైరా: అతనో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే వైరాలో మూడేళ్లుగా యువతీ యువకులకు, మహిళలకు ప్రముఖ కంపెనీలలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పించేందుకు శిక్షణ ఇస్తున్నాడు. అంతేకాకుండా కోచింగ్‌కు వచ్చే మహిళలను ప్రేమ పేరుతో మోసం చేయడం ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఓ మహిళను ప్రేమిస్తున్నానని వెంట పడి ఆ తర్వాత పెండ్లి చేసుకోమని సదరు మహిళ అడగటంతో తనకేమీ సంబంధం లేదంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. నాలుగు రోజుల కిందట బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వైరా పోలీసుల కథనం ప్రకారం.. కొణిజర్ల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఉప్పలాచారి మూడేండ్ల కిందట వైరా పాత కూరగాయల మార్కెట్‌ రోడ్డులో యూపీఎస్‌పీ సాఫ్ట్‌వేర్‌ కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి కోచింగ్‌కు వచ్చే వారి వద్ద నుంచి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ఫీజు పేరుతో వసూలు చేస్తూ సంపాదించుకుంటున్నాడు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన ఓ వివాహిత సాఫ్ట్‌వేర్‌ కోచింగ్‌ నిమిత్తం కోచింగ్‌ సెంటర్‌లో ప్రవేశం పొందింది. కోచింగ్‌ ఇచ్చే సమయంలోనే మహిళతో ఉప్పలాచారి పరిచయం పెంచుకుని ప్రేమ వ్యవహారం నడిపాడు. ఏడాదిన్నర పాటు ఇద్దరి మధ్య ప్రేమ నడిచింది. ఆ మహిళ వద్ద నుంచి రూ.6 లక్షలు నగదు కూడా తీసుకుని జల్సా చేశాడు. భర్తలేని సదరు వివాహితను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె మోసపోయింది. ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా తనకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించాడు. గతంలో మహిళ బంధువుల ఇంటికి వెళ్లి కూడా తాను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. తీరా మహిళ ఒత్తిడి చేయడంతో తనకేమీ సంబంధం లేదని తప్పించుకుని తిరుగుతున్నాడు. అవసమైతే సదరు మహిళను చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మహిళ ఫిర్యాదు మేరకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బెదిరింపులకు పాల్పడిన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కోచింగ్‌ సెంటర్‌లో వైరా, తల్లాడ, ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, ఏన్కూరు, మధిర, బోనకల్‌ అశ్వారావుపేట మండలాలకు చెందిన యువతీ యువకులు నగదు చెల్లించి కోచింగ్‌ తీసుకుంటున్నారు. ప్రస్తుతం సదరు వ్యక్తి కనిపించక పోవడంతో కోచింగ్‌కు వచ్చిన వారు లబోదిబోమంటున్నారు.

సాఫ్ట్‌వేర్‌ సెంటర్‌ నిర్వాహకుడు ఉప్పలాచారి1
1/1

సాఫ్ట్‌వేర్‌ సెంటర్‌ నిర్వాహకుడు ఉప్పలాచారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement