
బస్సులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే రాగమయి
సత్తుపల్లి/పెనుబల్లి: ప్రజలందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఒక్క ఫోన్‌కాల్‌తో అందుబాటులోకి వస్తానని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు. సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో మహాలక్ష్మి ఉచిత ప్రయాణ బస్సును ఆదివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేదే చెబుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలుచేస్తుందని స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి మహిళలకు ప్రయాణ చార్జీలు భారం కాకుండా ఉచిత ప్రయాణం కల్పించారని, మహిళలందరూ తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ప్రయాణించవచ్చని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తారని చెప్పారు. అనంతరం సత్తుపల్లి నుంచి కల్లూరు వరకు ఆర్టీసీ బస్సులో ఆమె ప్రయాణించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్‌చక్రవర్తి, ఏసీపీ రామానుజం, డీఎం రాజ్యలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ విజయశ్రీ, మున్సిపల్ కమిషనర్ కె.సుజాత, సీడీపీఓ కొండమ్మతో పాటు డాక్టర్ మట్టా దయానంద్, గాదె చెన్నారావు, నారాయణవరపు శ్రీనివాస్, కమల్‌పాషా పాల్గొన్నారు.