
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం
● కాంట్రాక్టర్లతో చేతులు కలిపిన కేఎంసీ అధికారులు ● పనులన్నీ ఒకరిద్దరికే అప్పగింత ● అధికారుల తీరును అలుసుగా తీసుకున్న వర్క్ ఇన్‌స్పెక్టర్ ● పోటీగా కమీషన్లకు తెరలేపిన వైనం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఒకరిద్దరు ఇంజనీర్లు ఉన్నతాధికారులను సైతం లెక్క చేయకుండా తమకున్న రాజకీయ అండతో నచ్చిన వారికే పనులను అప్పగిస్తూ పబ్బం గడుపుతున్నారు. పని వచ్చినా, రాకున్నా.. తమ మాట వినే సిబ్బందిని పక్కన ఉంచుకుని అవినీతికి తెరలేపుతున్నారన్న చర్చ కేఎంసీలో జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఇంజనీర్లు టెండర్లు లేకుండానే తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి వాటిని పూర్తి చేయిస్తున్నారు. ఇందుకు సదరు కాంట్రాక్టర్ల నుంచి పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కొద్దిరోజుల క్రితం మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మం వచ్చిన సమయంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు, బోజనాల సరఫరా తదితర కాంట్రాక్టులను ఒకరిద్దరికే ఇవ్వగా.. దానిపై పెద్ద చర్చ జరిగింది. ఇక ఇటీవల ఎన్నికల సమయంలోనూ ఇంజనీర్లు తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకే పనులు అప్పగించారన్న విమర్శలున్నాయి. ఈ అంశంలో ఇంజనీర్లపై ఓ కాంట్రాక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
పెరిగిన ఇంజనీర్ల ఆగడాలు..
కేఎంసీలో డీఈ స్థాయి గల ఒకరిద్దరు ఇంజనీరింగ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. వర్క్ ఇన్‌స్పెక్టర్ల నియామకం నుంచి ఏ డివిజన్‌లో ఎవరికి పనులు అప్పగించాలి..? ఏ పనిని ఏ కాంట్రాక్టర్లకు ఇవ్వాలనేది వారే నిర్ణయిస్తున్నట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. తమ మాట వినే వర్క్ ఇన్‌స్పెక్టర్లకు మాత్రమే ప్రాముఖ్యత కల్పిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు సదరు ఇంజనీరింగ్ అధికారులను మందలించే ప్రయత్నం చేస్తే రాజకీయ నేతలు, పలుకుబడి ఉన్న కాంట్రాక్టర్లతో మాట్లాడించి మౌనంగా ఉండేలా చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఓ అధికారి అండ చూసుకుని డ్రాయింగ్ బ్రాంచ్ సెక్షన్‌లో కూడా సిబ్బంది కమీషన్ల వేటలో నిమగ్నమయ్యారు.
సిబ్బందిదీ అదే దారి..
ఇంజనీరింగ్ అధికారుల వ్యవహారంతో.. సిబ్బంది కూడా అదే బాట పట్టినట్టు తెలుస్తోంది. అధికారులకు, కాంట్రాక్టర్లకు ఓ వర్క్ ఇన్‌స్పెక్టర్ మధ్యవర్తిగా మారి వారి పనులను చక్కబెడుతూ వచ్చాడు. ఇటీవలి కాలంలో సదరు వర్క్ ఇన్‌స్పెక్టర్ నేరుగా కొన్ని పనులను తానే దక్కించుకుని బినామీ కాంట్రాక్టర్‌తో పూర్తి చేయించినట్లు సమాచారం. అయితే సదరు పనులకు అనుమతులు లేవనే చర్చ కేఎంసీలో పెద్ద ఎత్తున జరుగుతోంది. అధికారులు అవినీతికి పాల్పడటంతోనే ఈ రకమైన వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై కేఎంసీ ఈఈ కృష్ణాలాల్‌ను వివరణ కోరగా.. ఒకరిద్దరికే కాంట్రాక్టులు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఇటీవల జరిగిన పనులపై నివేదిక తయారు చేస్తున్నామని, ఎవరైనా అవినీతికి పాల్ప డితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.