
పడిపోయిన చికెన్ ధరలు
● ఉత్పత్తి పెరగటంతో ధర పతనం ● కార్తీక మాసం మరో కారణం ● స్కిన్‌తో కిలో రూ.130, స్కిన్ లెస్ రూ.150
ఖమ్మంవ్యవసాయం: కోడి మాసం ధరలు తగ్గాయి. వేసవిలో కిలో రూ. 300 వరకు పలకగా ప్రస్తుతం సగానికి తగ్గింది. సాధారణంగా రూ. 200 నుంచి రూ. 250 వరకు ఉండే చికెన్ ధర ప్రస్తుతం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో ధర ప్రాంతాన్ని, కంపెనీని బట్టి రూ. 150 నుంచి రూ.160 వరకు విక్రయిస్తున్నారు. స్కిన్‌తో అయితే రూ.130 వరకే అమ్ముతున్నారు. కోడి(లైవ్ బర్డ్) కిలో ధర రూ. 70 నుంచి రూ. 75 వరకు విక్రయిస్తున్నారు. ఇక హోల్‌సేల్ ధరలు మరికొంత తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం శుభకార్యాలు, పెళ్లిళ్లు జోరుగా సాగుతున్నప్పటికీ చికెన్‌కు అంతగా డిమాండ్ లేదు. ధర తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని వ్యాపారులు, రైతులు(ఉత్పత్తిదారులు) విశ్లేషిస్తున్నారు. జిల్లాలో ప్రతి ఆదివారం 50 టన్నుల చికెన్ విక్రయం జరుగుతుంది. ఒక్క ఖమ్మం నగరంలోనే 25 టన్నుల వరకు విక్రయిస్తారు.
పెరిగిన ఉత్పత్తి..
ప్రస్తుత సీజన్‌లో రైతులు కోళ్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కోళ్ల ఉత్పత్తి బాగుందని వ్యాపారులు, రైతులు చెబుతున్నారు. ఓ వైపు శుభకార్యాలు, మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో వినియోగం అధికంగా ఉంటుందని బావించిన రైతులు కోళ్ల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఉత్పత్తికి తగిన విధంగా వినియోగం లేకపోవటంతో చికెన్ ధరలకు డిమాండ్ తగ్గింది.
అంచనాలు తలకిందులై రైతుల ఇక్కట్లు..
చికెన్ వినియోగంపై అంచనాలు తలకిందులు కావడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక పిల్ల ధర రూ. 50 వరకు ఉంటుంది. ఇక కిలో బరువు వచ్చేంతవరకు కోడిని పెంచేందుకు రూ.100 ఖర్చవుతుంది. సాధారణంగా పరిశ్రమలో 2 కిలోల బరువు వరకు కోళ్లను పెంచుతారు. ఆ బరువుతో ఉన్న కోళ్లను నిల్వ ఉంచుకుంటే దాణా ఖర్చు బాగా పెరుగుతుంది. దీంతో రైతులు ధరలను తగ్గించి విక్రయాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఉత్పత్తికి తగిన విధంగా విక్రయాలు లేకపోవటంతో ధర క్షీణించింది.
ఆధ్యాత్మిక మాసం కావడంతో..
చికెన్ ధరలు తగ్గటానికి మరో కారణం కార్తీక మాసం. సహజంగా కార్తీక మాసంలో మాంసాహారాల ధరలు తక్కువగా ఉంటాయి. అయితే ఈ ఏడాది చికెన్ ధరలు మరికొంత తగ్గాయి. కార్తీక మాసంలో ప్రధానంగా హిందువులు ఆధ్యాత్మికతతో ఉంటారు. ఈ నెలలో ఎక్కువ మంది మాంసాహారం తినరు. కొందరు ఇళ్లలో మాంసాహార వంటలను కూడా ఈ నెల రోజుల పాటు పూర్తిగా మానేస్తారు. దీంతో ఈ మాసంలో చికెన్ వినియోగం బాగా తగ్గింది. గత ఏడాది కార్తీక మాసంలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 180 ఉండగా. ఈ ఏడాది మరింతగా తగ్గించి రూ.150 చొప్పున విక్రయిస్తున్నారు.
డిమాండ్ లేకే ధర పతనం
ఉత్పత్తికి తగిన డిమాండ్ లేక ధరలు తగ్గాయి. గతంతో పోలి స్తే గణనీయంగా కోళ్ల పరిశ్రమలు పెరిగాయి. దీంతో ఉత్పత్తి పెరిగింది. అందుకు తగ్గ విని యోగం లేదు. దీంతో విక్రయాలు తగ్గాయి. ఈ పరి స్థితిలో విక్రయదారులకన్నా ఉత్పత్తిదారులకే నష్టం జరుగుతుంది. ఓ వైపు పోషణ ధరలు పెరుగుతుండగా, మరోవైపు చికెన్‌కు డిమాండ్ పడిపోతోంది..
– రావి బాబూరావు, పౌల్ట్రీ యజమాని, ఖమ్మం
అందుబాటులో చికెన్ ధర
చికెన్ ధరలు అందుబాటులో ఉన్నాయి. వేసవి, వానాకాలంతో పోలిస్తే ప్రస్తుతం చికెన్ ధరలు బాగా తగ్గాయి. నెల రోజుల క్రితం రూ. 220 పలికిన చికెన్ ధర ప్రస్తుతం రూ. 150 వరకే ఉంది. కార్తీక మాసం కావడంతో ధరలు తగ్గాయని బావిస్తున్నాం. చికెన్ ధర తగ్గటం శుభకార్యాలు నిర్వహించే వారికి ప్రయోజనం.
– సోమారపు సుధీర్, ప్రకాష్‌నగర్, ఖమ్మం

కోళ్ల పరిశ్రమ

