దూసుకొచ్చిన మృత్యువు | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

Published Thu, Nov 16 2023 12:34 AM

కవిత (ఫైల్‌) - Sakshi

పాల్వంచ: తెల్లవారుజామున మెయిన్‌ రోడ్డు శుభ్రం చేసే పనులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలికి కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. అప్పటివరకు తోటి కార్మికులతో సరదాగా వచ్చి విధుల్లో చేరిన కొద్ది నిమిషాలకే ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని గట్టాయిగూడెంనకు చెందిన వడ్లకొండ కవిత (35) పాల్వంచ మున్సిపాలిటీలో మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికురాలిగా పనిచేస్తోంది. రోజు మాదిరే బుధవారం తెల్లవారుజామున విధుల్లో చేరింది. అప్పటివరకు తోటి కార్మికులతో మాట్లాడుకుంటూ మున్సిపల్‌ ట్రాక్టర్‌లో బీసీఎంరోడ్‌లోని నవభారత్‌ కేఎస్‌ఎం బంక్‌ సమీపంలో రోడ్డుపక్కన చెత్తను ఎత్తే పనిలో నిమగ్నమైంది. అదే సమయంలో పాల్వంచ వైపు నుంచి కొత్తగూడెం వెళ్తున్న కారు ఒక్కసారిగా ఆమెను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆమె కొంతదూరం ఎగిరిపడింది. తీవ్ర గాయాలైన ఆమెను కారులోని వ్యక్తే కార్మికులతో కలిసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. అనంతరం కారు డ్రైవర్‌ పరారయ్యాడు. అతడిని గుండాల మండలానికి చెందిన అశోక్‌గా గుర్తించారు. మృతురాలి భర్త లక్ష్మీనారాయణ కూలి పనులు చేస్తుంటాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాఘవయ్య తెలిపారు. తమతోఉన్న కవిత మృతి చెందడంతో తోటి కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు.

కారు ఢీకొట్టడంతో విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు మృతి

Advertisement
 
Advertisement