
జూలూరుపాడులోని జామ తోట
● జూలూరుపాడు మండలంలో పలువురి ఆసక్తి ● విస్తృతంగా సీతాఫలం, జామ తోటల సాగు ● ఏటేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
జూలూరుపాడు: సంప్రదాయ పంటలతో సరైన లాభాలు లేకపోవడం.. చీడపీడలతో పెట్టుబడి పెరుగుతుండడం.. ఎప్పుడు ఏ ఆపద వచ్చి పంట కోల్పోతామో తెలియని పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా కాస్త శ్రద్ధ వహిస్తే చాలు త్వరగా దిగుబడి వచ్చే పంటలైన పండ్ల తోటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. జామ, సీతాఫలం వంటి పండ్ల తోటలు పెంచుతుండటంతో రైతులకు స్థిర ఆదాయం లభించడమే కాక ప్రజలకు పండ్లు అందుబాటులోకి వస్తున్నాయి.
తక్కువ కాలంలోనే చేతికి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, కాకర్ల, మాచినేనిపేట గ్రామాల్లోని రైతులు పలువురు తైవాన్ జామ, పడమటనర్సాపురం, జూలూరుపాడు గ్రామాల రైతులు సీతాఫలం సాగు చేస్తున్నారు. తక్కువ కాలంలో పంట చేతికి వచ్చే తైవాన్ (హైబ్రిడ్) జామను ఎంచుకోగా.. వేడితో కూడిన పొడి వాతావరణంలో కూడా ఇబ్బంది ఎదురుకావడం లేదని చెబుతున్నారు. అంతేకాక ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుని మంచి దిగుబడి వస్తోంది. జామ మొక్కలు నాటిన ఆరు నెలల్లోనే కాపు వస్తుండగా, ఏడాదికి ఆరు సార్లు కాపు వస్తోందని చెబుతున్నారు. ఏటా ఎకరానికి సుమారు 80 నుంచి 100 క్వింటాళ్ల (8 నుంచి 10 మెట్రిక్ టన్నుల) జామ పంట దిగుబడి వస్తోంది. ఎకరం విస్తీర్ణంలో జామ పంట సాగుకు రూ.50 వేలు పెట్టుబడి పెడుతున్నారు. అయితే, ఏటా రూ.లక్ష వరకు ఆదాయం వస్తుండడంతో జామ సాగు చేసే రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. అలాగే, పడమటనర్సాపురం, జూలూరుపాడుకు చెందిన రైతులు పలువురు నాలుగేళ్లుగా సీతాఫలం సాగు చేస్తున్నారు. మొక్క నాటితే మూడు నుంచి నాలుగో సంవత్సరం, విత్తనం మొక్క అయితే తొమ్మిదేళ్లకు దిగుబడి వస్తుంది. సీతాఫలాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యాన నష్టం ఎదురయ్యే పరిస్థితి లేదని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు లాభదాయకం..
పండ్ల తోటల పెంపకం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. జామ పంట ఏడాదికే చేతికి వస్తుంది. జిల్లాలో సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో తైవాన్, అలహాబాద్ సఫేదా జామ సాగు చేశారు. సీతాఫలం కూడా పలువురు రైతులు సాగు చేస్తున్నారు. – జినుగు మరియన్న,
భద్రాద్రి జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ అధికారి
మూడెకరాల్లో జామసాగు చేస్తున్నా
పత్తి, మిరప సాగు చేస్తే నష్టం వచ్చింది. దీంతో ఎకరానికి రూ.50 వేల పెట్టుబడితో మూడేళ్ల కిందట మూడెకరాల్లో జామ సాగు చేశాను. ఏడాదిలో ఆరు సార్లు కాపు వస్తోంది. కోతుల బెడద తప్ప ఇతరత్రా ఇక్కట్లు లేకపోవడంతో సాగు లాభసాటిగానే ఉంది.
– గుండెపిన్ని వెంకటేశ్వర్లు, రైతు, జూలూరుపాడు
13 ఎకరాల్లో సీతాఫలం..
13 ఎకరాల విస్తీర్ణంలో సీతాఫలం తోట వేశాను. 2020 సంవత్సరంలో అంటు మొక్క కడితే నాలుగో ఏట పంట చేతికి వచ్చింది. ప్రతీ చెట్టుకు 50 నుంచి 100 కాయలు నాణ్యతగా రావడంతో తోట వద్దే అమ్మాను. మరికొందరికి ఆర్టీసీ కార్గోలో కూడా పంపించా.
– గుగులోత్ రాంబాబు, రైతు, పడమటనర్సాపురం

సీతాఫలం చెట్టుకు కాచిన కాయలు




Comments
Please login to add a commentAdd a comment