ఎండ మండింది!

- - Sakshi

● జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు ● నేలకొండపల్లిలో అత్యధికంగా 46.6 డిగ్రీలు ● ఈ వేసవి సీజన్‌లో ఇదే అత్యధికం

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో శుక్రవారం ఎండలు మండాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా నేలకొండపల్లి రెండోస్థానంలో నిలిచింది. నల్లగొండ జిల్లా దామరచర్లలో 46.8 డిగ్రీలు నమోదు కాగా.. ఆ తర్వాత నేలకొండపల్లిలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే రికార్డు స్థాయి ఉష్ణోగ్రత అని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అలాగే ముదిగొండ మండలం బాణాపురంలో 46.3, పమ్మిలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత నెల 25న మొదలైన రోహిణి కార్తె ఈనెల రెండో వారంతో ముగియనుంది. గత వారం రోజులుగా ఎండవేడితో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే ఉష్ణతాపం మొదలవుతోంది. మధ్యాహ్నానికి గరిష్ట స్థాయికి చేరి వడగాలులు వీస్తూ రాత్రి 7 గంటల వరకు వేడి తగ్గకపోగా ప్రజలు బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. జిల్లాలోని 16 ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదు కావడం సూర్యప్రతాపానికి దర్పణం పడుతోంది. రెండు రోజుల క్రితం జల్లులు కురిసి ఈదురుగాలులు వీచినా వేడి ఏ మాత్రం తగ్గడం లేదు.

భానుడి ప్రతాపంతో బోసినపోయిన నేలకొండపల్లి రహదారి

శుక్రవారం అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు..

ప్రాంతం ఉష్ణోగ్రత (డిగ్రీల్లో)

నేలకొండపల్లి 46.6

బాణాపురం 46.3

పమ్మి 46.3

ఖానాపురంహవేలి 45.2

సత్తుపల్లి 45.1

నాగులవంచ 44.9

పల్లెగూడెం 44.9

ముదిగొండ 44.9

గంగారం 44.7

మధిర 44.7

లింగాల 44.6

ఎర్రుపాలెం 44.4

తిరుమలాయపాలెం 44.2

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top